Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ అంటే ప్రధానే.. ఆ ఇద్దరికీ ఎర్రజెండా అంటే భయం
- కేరళలో బీజేపీ ప్రభుత్వ సంస్థలు అమ్ముతుంటే.. సీపీఐ(ఎం) ప్రభుత్వం నిలబెడుతుంది: సంగారెడ్డి సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్
- మెదక్, సంగారెడ్డిలో జన చైతన్య యాత్రకు అపూర్వ స్పందన
- రెడ్ షర్ట్లు ధరించి వేలాది మంది కార్మికుల భారీ ప్రదర్శన
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి (మేకల కృష్ణ)
'మీ వెనకాల అదానీ, అంబానీలుండొచ్చు. మా వెనకాల దేశ ప్రజలున్నరు. మీరు అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేట్ విధానాల్ని ప్రజల్లో ఎండగట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతం. తెలంగాణ గడ్డపై మోడీ ఆటలు సాగవు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలనే మీ కుట్రల్ని తిప్పికొడ్తం. దేశంలో పరిస్థితి అదానీ అంటే ప్రధానీ.. ప్రధానీ అంటే అదానీలా మారింది. ఈ ఇద్దరికీ ఎర్రజెండా అంటే భయం. దేశ సంపదైన ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్ముతూ ప్రజలపై ధరల భారాలు మోపుతూ దేశాన్ని రాచరికం వైపు తీసుకెళ్తున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టేందుకు దేశంలోని విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి' అని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్ అన్నారు. సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కొనసాగింది. అపూర్వ స్పందన లభించింది. జన చైతన్య యాత్రకు మెదక్ జిల్లాలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాలిక్, మున్సిపల్ చైర్మెన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, నర్సాపూర్ ఎంపీపీ, బీఆర్ఎస్ నాయకులు నర్సింగ్‌రావు, బీఎస్పీ రాష్ట్ర నాయకులు శాంతన్న, సంగారెడ్డి జిల్లాలో డీసీసీ వైస్ చైర్మెన్ పట్నం మాణిక్యం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బీరయ్య యాదవ్ మద్దతు తెలిపి సభలో ప్రసంగించారు. సంగారెడ్డి జిల్లాలో వేలాది మంది మోటర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రెడ్ షర్ట్లు ధరించి వివిధ కంపెనీల కార్మికులు దౌల్తాబాద్ నుంచి సంగారెడ్డి వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.
సంగారెడ్డి బహిరంగ సభలో వెంకట్ ప్రసంగించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేక నియంతృత్వం నడుస్తుందా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఓ సందర్భంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యకు కోర్టు శిక్ష వేస్తూ తీర్పు చెబితే.. వెంటనే పార్లమెంట్లో అతనిపై అనర్హత వేటు వేయడం ఏమిటని ప్రశ్నించారు. అదానీ అక్రమాలపై విచారణ జరపాలని 50 మంది విపక్ష ఎంపీలు ఆందోళన చేస్తే వారినీ అరెస్టు చేయడం, లిక్కర్ పేరిట సిసోడియా, కవితపై కేసులు పెట్టి వేధించడం నియంతృత్వ ధోరణికి నిదర్శమన్నారు. బీజేపీ మళ్లీ గెలిస్తే అదాని, అంబానీ, కార్పొరేట్ శక్తులు తప్ప ప్రభుత్వ రంగ సంస్థలుండవన్నారు. ఇప్పటికే అనేక సంస్థల్ని అమ్మేస్తున్నారని వివరించారు.
ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రయివేట్‌పరం చేసి కార్మికుల్ని వీధిన పడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీషోళ్లకు వ్యతిరేకంగా పోరాడి జైళ్లకెళ్లిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. లౌకిక విధానం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిక్షణ కోసం సీపీఐ(ఎం) దేశ వ్యాప్తంగా పోరాడుతుందన్నారు.