Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి బొగ్గు గనులను అమ్మబోమని.. ఇప్పుడు వేలం వేస్తున్నారు : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య
- మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో సాగిన జన చైతన్య యాత్ర
- అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజల నీరాజనం
నవతెలంగాణ - కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి (బండోజు శ్రీకాంత్)
'మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతూ రాజకీయ లబ్ది పొందుతున్న బీజేపీకి రాష్ట్రంలో చోటు ఇవ్వకూడదు. బీజేపీ అంటు కూడా దగ్గరికి రానివ్వొద్దు. దేశ ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ.. అడ్డగోలు ధరలతో ప్రజలను దిగజార్చుతున్నారు. మతం పేరిట హిందువుల ఓటు బ్యాంకుతో గెలుస్తూ వస్తున్న బీజేపీ.. ఆ హిందువుల పైనే పన్నుల భారాన్ని మోపుతున్న విషయాన్ని ప్రజలందరూ గ్రహించి ఐక్యంగా తిప్పి కొట్టాలి' అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య పిలుపునిచ్చారు.
ఈ నెల 23న ఆదిలాబాద్ నుంచి ప్రారంభమైన సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర శనివారం మంచిర్యాల నుంచి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోకి ప్రవేశించింది. ఈ యాత్రకు పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది బైక్‌లతో ర్యాలీ తీసి ఘన స్వాగతం పలికారు. గోదావరి బ్రిడ్జి నుంచి 2వేల మందితో ప్రారంభమైన బైక్‌ర్యాలీ మున్సిపల్ కార్యాలయం మీదుగా భారీ జన ప్రదర్శనతో మెయిన్ చౌరస్తాకు చేరుకుంది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు సీపీఐ(ఎం) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వై.యాకయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 31నాటికి దేశంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకూడదని, అందరికీ పక్కా ఇల్లు నిర్మిస్తామని ప్రధాని మోడీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికీ ఇల్లు లేని నిరుపేదలకు 50గజాల స్థలం కూడా ఇవ్వకపోగా, కనీసం స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించేందుకు రూపాయి ఇవ్వలేదన్నారు.
సింగరేణి సంస్థలో 16,000 మంది కార్మికులు ఉంటే అందులో 8,000 మంది వలస కార్మికులు ఉన్నారని, ఇప్పుడు ఆ వలస కార్మికుల చట్టాన్ని ఎత్తేసి వారి హక్కులను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక చట్టాలన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు ప్రతిరోజూ ఏడు గంటల పనితో, వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలు ఉండాలని సీపీఐ(ఎం) పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
దేశ చరిత్రలో ఏ రోగం వచ్చినా.. ఏ వైరస్ దాడి చేసినా అన్ని ప్రభుత్వాలు ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చాయని, మోడీ సర్కారు మాత్రం కరోనా వ్యాక్సిన్‌ను అమ్ముకుందన్నారు. ప్రధాని మోడీ లెక్క ప్రకారం రోజుకు రూ.176 కంటే తక్కువ వేతనం ఇచ్చే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని, అసలు ఆ వేతనంతో జనం బతుకుతారా? అని ప్రశ్నించారు. గతంలో గోదావరిఖనికి వచ్చిన ప్రధాని మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులును తాము అమ్మటం లేదని, అమ్మేందుకు తమకు అధికారం లేదని మాట్లాడిన మోడీ.. సింగరేణి బొగ్గు గనుల బ్లాక్‌లను ఇప్పుడు వేలం వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే సత్తుపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి, మంచిర్యాల, ఖమ్మం ప్రాంతాల్లో బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గులో 25శాతాన్ని ఉత్పత్తి చేస్తున్న సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయివేటు బొగ్గును 10శాతం కొనుగోలు చేయాలని బీజేపీ సర్కార్ చెప్పడం ఆ పార్టీ విధానాలను స్పష్టం చేస్తున్నదన్నారు.
పెద్దపల్లికి చేరుకున్న యాత్ర పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి జగిత్యాలకు చేరుకోగా, పార్టీ జిల్లా కన్వీనర్ తిరుపతి నాయక్ అధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. ఆయా బహిరంగ సభల్లో ఎస్.వీరయ్యతోపాటు బృంద నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీష్, పి.ఆశయ్య, పి.స్కైలాబ్ బాబు, పి.విజయలక్ష్మి, అడివయ్య, బిక్షమయ్య, భూపాల్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రసంగించారు. కాగజ్‌నగర్ నుంచి బెల్లంపల్లి మీదుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దివాకర్‌రావు ప్రసంగించారు.
కోలాటాలు, బతుకమ్మ ఆట పాటలు, నత్యాలతో పెద్ద ఎత్తున టపాకాయలు కాలుస్తూ జన చైతన్య యాత్ర నాయకులు గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు పాదయాత్రగా చేరుకున్నారు. కళారూపాలు ఆకట్టుకున్నాయి. డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, రామగుండం ఇండిస్టియల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బహిరంగ సభ, బైక్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అచ్ఛేదిన్ మోడీ, ఆయన మిత్రులకే..
అచ్చే దిన్ ఆనేవాలాహై అని మోడీ చెప్పి తొమ్మిదేండ్లు గడిచాయని, ఆ మంచి రోజులు మోడీ ఆయన మిత్రులైన అదానీ, అంబానీలకే వచ్చాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. సంగారెడ్డి, మెదక్ సభల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వరంగ సంస్థల్ని తెగనమ్ముతున్న మోడీని గద్దెదించేందుకు కార్మికులు, కర్షకులు, మహిళలు, కూలీలు, యువజనులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.రమ, ఎంవీ.రమణ, జె.వెంకటేశ్, ఆర్.వెంకట్రామ్లు, ఎ.మల్లేశం, జయరాజు, యాత్ర బృంద సభ్యులు ధర్మానాయక్, విజరు, రవి, శోభన్‌నాయక్, బి.పద్మ, జె.మల్లికార్జున్ పాల్గొన్నారు
- చుక్క రాములు- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
శూద్రులారా బీజేపీని బహిష్కరించండి..
రెడ్డి, వెలమ, కమ్మ, కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లంతా కూడా శూద్రులేనని మనుధర్మ శాస్త్రం చెబుతోంది.. వీళ్లంతా హీనంగా బానిసలుగా బతకాలని చెప్పే మనుధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాలి.. అందుకే శూద్రులంతా బీజేపీని బహిష్క రించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లాలో జన చైతన్య యాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఈ ప్రాంతానికి ఏం తీసుకొచ్చిందో..? ఏం ఇచ్చిందో..? చెప్పాలని ప్రశ్నించారు.
- జాన్‌వెస్లీ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు