Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆహార సబ్సిడీపై రూ. 90 వేల కోట్లకు కోత
- ఉమ్మడి అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు
- ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో వస్తున్నవి 30 శాతమే
సమాఖ్య స్ఫూర్తికి విఘాతం
- ఎన్నికైన ప్రతిపక్ష ప్రభుత్వాలపై స్వారీ
- గుప్పెట్లోకి సహకార రంగం
నవతెలంగాణతో ప్రొఫెసర్ డాక్టర్ కె.నాగేశ్వర్
''దేశంలో రాష్ట్రాలపై అనేక రూపాల్లో కేంద్రం అణచివేత కొనసాగు తున్నది... జీఎస్టీతో రాష్ట్రాల ఆదాయాన్ని కేంద్రం కొల్లగొడుతున్నది.. వ్యవసాయ చట్టాలు వివాదాస్పదమయ్యాయి..ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉన్నది..ఉచిత పథకాలన్నీ చెడ్డవి కాదు..ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న మాట నిజమే..రాజకీయ ప్రయోజ నాల కోసమే రాజ్యాంగంపై దాడి..ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారు...సబ్సీడీలను ఎత్తేస్తూ కార్పొరేట్లకు మద్థతిస్తున్నారు.. సహకార రంగాన్ని గుప్పెట్లోకి తీసుకుని ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారు..రాష్ట్రాలకు ఫైనాన్స్ కమిషన్ నిధులనూ సక్రమంగా ఇవ్వడం లేదని అంటున్నారు మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ డాక్టర్ కె. నాగేశ్వర్. రాజ్యాంగం, రాష్ట్రాల హక్కులు, ఆర్థిక మందగమనం, మీడియా పరిస్థితి, జీఎస్టీ, ప్రజలపై భారాలు తదితరాలపై నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి బి.బసవపున్నయ్యకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
దేశంలో సమాఖ్య స్పూర్తికి విఘాతం కలుగుతోంది కదా,
ఏదైనా వ్యూహాం ఉందనుకోవచ్చా ?
రాష్ట్రాల హక్కులపై అనేక రూపాల్లో దాడి జరుగుతున్నది. రాష్ట్రాల జాబితాల్లోని అంశాలపై కూడా కేంద్రం చట్టాలు చేస్తున్నది. వ్యవసాయం రాష్ట్రాల జాబితాలో ఉంది. అయినా కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. ఉమ్మడి జాబితాపై ఏకపక్షంగా తన విధానాన్ని రాష్ట్రాలపై బలవంతంగా రద్దుతున్నది. విద్య, విద్యుత్, ఉమ్మడి జాబితాలోని అంశాలు, కానీ కేంద్రం నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది. విద్యుత్ సవరణ చట్టం పేరిట బలవంతంగా విద్యుత్ సంస్కరణలను అమలుచేస్తున్నది. రాష్ట్రాల అప్పులకు అనుమతి ఇవ్వాలంటే, వ్యవసాయ పంపుసెట్లకు కరెంటు మీటర్లు బిగించాలనే షరతులు పెడుతున్నది. సహకార రంగాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంది. అఖిలభారత సర్వీసు(ఏఐఎస్) ధికారుల కేంద్ర డిప్యూటేషన్‌పై కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది.
జీఎస్టీ ప్రభావం రాష్ట్రాలపై ఎలా ఉంది ?
జీఎస్టీతో రాష్ట్రాలు పన్నుల స్వయం ప్రతిపత్తిని కోల్పోయాయి. చివరకు జీఎస్టీ నష్టపరిహారాన్ని కొనసాగించాలన్నా రాష్ట్రాల డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు కాకుండా కేంద్రానికి వెళ్లే సర్ఛార్జీలను మాత్రమే పెంచుతున్నది. ఫైనాన్స్ కమిషన్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం కేటాయించిన్పటికీ ఆచరణలో వస్తున్నది 30 శాతానికి మించడం లేదు. కేంద్ర పథకాలపై కూడా నిధులకోత విధిస్తున్నది. రాష్ట్రాల మధ్య డబుల్ ఇంజిన్ పేరిట వివక్ష చూపుతున్నది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు సైతం గుజరాత్‌కు తరలిం చింది. ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవ హారం రాజ్యాగానికే తలవంపులు తెస్తున్నది. ఎన్ని కైన ప్రభుత్వాలను పనిచేయ కుండా అడ్డుపడు తున్నది.
పేదలకు ఇచ్చే పథకాలను ఉచితాలు అనడం సరైందేనా ?
ఉచిత పథకాలన్నీ చెడ్డవని చెప్పలేం. మధ్యాహ్నా భోజన పథకం పాఠశాలల్లో పిల్లల హాజరును పెంచింది. పౌష్టికాహారం స్థాయిని పెంచింది. రైతు బంధులాంటి పథకాలు వ్యవసాయ దారులకు అండగా నిలిచాయి. కానీ, ప్రజల సంక్షేమంపైనా ఉచితాల పేరిట కేంద్ర ప్రభుత్వం కోతలు పెడుతున్నది. తాజా బడ్జెట్లో ఆహార సబ్సీడీపై కేటాయింపులను రూ.90 వేల కోట్లు తగ్గించింది. ఎరువులపై సబ్సీడీలపై రూ.50 వేల కోట్లకు కోత పడింది. చివరకు పీఎం పోషణ్‌గా పిలవబడే మధ్యాహ్నా భోజన పథకానికీ రూ.1100 కోట్ల కోత తప్పలేదు. ఉపాధి హామీ పథకంపైన అయితే మూడో వంతు నిధులు కట్ చేశారు. కానీ, 2019, సెప్టెంబరులో కార్పొరేట్ ఆదాయ పన్నుల్లో 10 శాతం తగ్గించడం వల్ల కేంద్ర ప్రభుత్వం రూ.1.84 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయింది.
దేశంలో రాజ్యాంగంపై దాడి జరుగుతున్నదంటరా ?
రాజ్యాంగంపైన కేంద్రం తీవ్రమైన దాడి చేస్తున్నది. మౌలిక స్వరూపానికే ఎసరు పెడుతున్నది. జడ్జీల నియామకాలను సైతం తామే చేస్తామంటూ కేంద్ర మంత్రి ప్రకటన, న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిపై దాడి చేయడమే. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులపై అనేక రూపాల్లో దాడి జరుగుతున్నది. సెక్యులరిజం అనే పదాన్నే రాజ్యాంగం నుంచి తొలగించాలంటూ కేంద్ర పెద్దల ప్రకటనలు రాజ్యాంగంపై దాడికి పరాకాష్ట. గవర్నర్లు ప్రతిపక్షపాలిత రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలపై స్వారీ చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర సంస్థలను తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలపైనా ప్రయోగిస్తున్నారు. ఫిరాయింపు లను ప్రోత్సహిస్తూ, విపక్షాలను చీలుస్తూ తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలను మార్చేశారు.
మీడియా పట్ల ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉంది ?
ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకు విఘాతాలు కలిగించారు. ఉదాహరణగా కరోనా మరణాలను దాచిపెట్టాలని చూసినప్పుడే ధైర్యంగా కథనాలు ప్రచురించిన దైనిక్‌భాస్కర్ గ్రూపుపై ఐటీ దాడులు జరిగాయి. ప్రభుత్వంపైన విమర్శనాత్మక కథనాలు రాసే ది వైర్, న్యూస్‌క్లిక్, న్యూస్ లాండ్రీ లాంటి సంస్థలపైనా ఈడీ, ఐటీ లాంటి కేంద్ర సంస్థలను ప్రయోగించారు. టెలివిజన్ మీడియాలో తమకు అనుకూలమైన రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ లాంటి ఛానళ్లను పెంచి పోషించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే చరిత్ర కలిగిన ఎన్‌డీటీవీనీ అదానీ కైవసం చేసుకున్నారు. ప్రశ్నించే మీడియాపై దాడులు, పాత్రికేయులపై రాజద్రోహం కేసులు పెడుతున్నారు. హక్కుల కార్యకర్తలపైనా తీవ్రవాద వ్యతిరేక చట్టాలను ప్రయోగిస్తున్నారు. రాజ్‌దీప్ సర్దేశారు, వినోద్‌దువా లాంటి ప్రఖ్యాత జర్నలిస్టులకు కూడా రాజద్రోహం కేసులు తప్పలేదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత బాలికపై జరిగిన లైంగిక దాడిని కవర్‌చేయడానికి వెళుతున్న జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌ను తీవ్రవాదిగా ముద్రవేసి నెలల తరబడి నిర్భందించారు. ప్రపంచంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన బీబీసీపై ఆదాయ పన్ను శాఖను ప్రయోగించి భారతీయ మీడియాకు పరోక్షంగా హెచ్చరిక చేశారు. డిజిటల్ మీడియాలో ప్రచురితమవుతున్న వార్తలను తప్పంటూ కేంద్ర ప్రభుత్వ ప్రచార సంస్థ అయిన పీఐబీ పేర్కొంటే, వాటిని తొలగించాల్సిందేనంటూ డిజిటల్ మీడియాలో నిబంధనలు మార్చారు. ప్రసారభారతికి వార్తలు సరఫరా చేసేందుకు ప్రఖ్యాత వార్తాసంస్థ పీటీఐ స్థానే ఆర్ఎస్ఎస్ అనుబంధ వార్తా సంస్థ అయిన హిందూస్థాన్ సమాచార్‌తో ఒప్పందం కుదిరింది. ఇలా ప్రసార ప్రపంచంలో తమ అనుకూల వార్తలు, కథనాలు విస్తృతంగా వచ్చేలా, తద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయి. సుప్రీంకోర్టు సైతం వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ చర్యలను తప్పుబడుతూ ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రాధాన్యతను నొక్కి చెప్పాల్సి వచ్చింది. అధికార పార్టీ వైఖరీకి భిన్నంగా మాట్లాడేవారు, రాసేవారు ఏస్థాయిలో ఉన్నా, సామాజిక మాధ్యమా ల్లో అధికార, పరివార ట్రోల్స్‌తో వేటాడుతున్నారు.
ప్రజలపై భారాల సంగతేంటి ?
ప్రజలపైన ఆర్థిక భారాలు పెరుగుతున్నాయి. ప్రత్యక్ష పనుల కన్నా, సామాన్యుడు చెల్లించే పరోక్ష పన్నుల భారమే ఎక్కువైంది. ఆశ్రిత పెట్టుబడి దారులకే కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. రాఫెల్ ఒప్పందంలో అనిల్అంబానీకి వేల కోట్లు ప్రయోజనం కల్పించింది. అదానీ వ్యవహారం కేంద్ర ప్రభుత్వ ఆశ్రిత పెట్టుబడిదారి విధానానికి పరాకాష్ట. ప్రతిఫలంగా బడా కార్పొరేట్ల నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలోనూ ఇతరత్రాను అధికార పార్టీ వేల కోట్లు విరాళాలు పొందుతున్నది. ఈ డబ్బుతోనే ఎన్నికలను ప్రభావితం చేస్తున్నది. పార్టీలను చీలుస్తున్నది. ప్రజాప్రతినిధులను కోనేస్తున్నది. ప్రజాతీర్పులకు భిన్నంగా ప్రభుత్వాలనే కైవసం చేసుకుంటున్నది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాలు ఇందుకు ఉదాహరణలు.