Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెజార్టీ ఉందని ఇష్టమొచ్చినట్టు చట్టాలు
- రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయటం దుర్మార్గం :
- బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వర్రావు
- సీపీఐ(ఎం) జనచైతన్య యాత్రకు సంఘీభావం
- హుజూర్నగర్ నుంచి అచ్చిన ప్రశాంత్
దేశంలో ఎమర్జెన్సీ కంటే దారుణమైన పాలన, అణచివేత నడుస్తున్నదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. బ్రిటీష్ పాలనలో కూడా ఇలాంటి ధోరణి ఎప్పుడూ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మెజార్టీ ఉందనే కారణంతో బీజేపీ ఇష్టమొచ్చినట్టు చట్టాలు చేసుకుంటూ పోతున్నదని వాపోయారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో తలపెట్టిన జన చైతన్య యాత్ర తొమ్మిది రోజైన శనివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్‌లో కొనసాగింది. నేలకొండపల్లి మండల కేంద్రంలో యాత్రకు నామా సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో అన్ని వస్తువులపైనా పన్నుల శాతాన్ని పెంచుకుంటూ పోతున్నదని చెప్పారు. పైగా, నిత్యావసర ధరలకు రాష్ట్రాలే కారణమంటూ విషప్రచారం చేస్తున్నదని విమర్శించారు. మోడీది రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని నొక్కి చెప్పారు. రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తున్నదని తెలిపారు. వ్యవసాయ రంగంలో మూడు నష్టదాయకమైన చట్టాలను తిప్పికొట్టిన ఘనత దేశ రైతాంగానికి దక్కుతుందని చెప్పారు. దేశంలో జరుగుతున్న పరిణామాల గురించి వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు సీపీఐ(ఎం) యాత్రలు చేపట్టడం బాగుందన్నారు. రాష్ట్రంలోకి బీజేపీని రానీయొద్దంటూ పిలుపునిచ్చారు. ఇకముందు రాష్ట్రంలో కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పారు.
రెచ్చగొట్టేందుకు బీజేపీ హిందూత్వ ముసుగు : తమ్మినేని
దేశంలో మెజార్టీ ప్రజలను రెచ్చగొట్టేందుకే బీజేపీ హిందూత్వ ముసుగు కప్పుకుని ముందుకు సాగుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హిందూవులకు మోడీ సర్కారు చేసిన మేలు ఏమీ లేదన్నారు. దళితులు హిందువులే కదా? వారిపై ఎందుకు దాడులు చేస్తున్నారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. గిరిజనులు హిందువులే కదా? మరి వారికి అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎందుకు న్యాయం చేయడం లేదని నిలదీశారు. అన్ని పార్టీలూ బీసీ గణన చేపట్టి వారి రిజర్వేషన్ల సంగతి తేల్చాలని పట్టుబడుతుంటే... చేయబోమంటూ మోడీ సర్కారు ఎందుకు మొండి పట్టు పడుతున్నదని ప్రశ్నించారు. అసలు రిజర్వేషన్లనే వద్దంటున్న తీరును ఎండగట్టారు. మహిళలపై దాడులు పెరిగిపోవటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కుల వ్యవస్థ ఉండొద్దంటూ కమ్యూనిస్టులు కోరుకుంటుంటే...మనుధర్మాన్ని తీసుకొచ్చి ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మోడీ సర్కారు చూస్తున్నదని తెలిపారు. ప్రశ్నించే వారి పైనా, ప్రతిపక్ష పార్టీలపైనా కక్షగట్టి వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పార్ల మెంట్ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చని అన్నారు. కౌలు రైతులకు కూడా పంట నష్టపరిహారం రూ.10 వేలు ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతించారు. ప్రభుత్వం చేసే మంచి పనులను మెచ్చ కుంటూనే ప్రజలకిచ్చిన హామీలపై సీపీఐ(ఎం)గా పోరాడుతామని స్పష్టం చేశారు.
ఈ యాత్ర భిన్నమైంది: జూలకంటి
రాష్ట్రంలో అన్ని పార్టీలూ పాదయాత్రలు చేస్తున్నాయనీ, అయితే వాటికి సీపీఐ(ఎం) చేస్తున్న జనచైతన్య యాత్ర చాలా భిన్నమైనదని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఒకరినొకరు తిట్టుకునేందుకు మిగతా పార్టీలు యాత్రలు చేస్తుంటే..సీపీఐ(ఎం) ప్రజలను చైతన్యపరిచే యాత్ర చేస్తున్నదని చెప్పారు. దేశంలో పేదరిక, ఆర్థిక అసమానతలను రూపుమాపుతామంటూ అధికారంలోకి వచ్చిన మోడీ పూర్తిగా కార్పొరేట్ల పక్షం వహిస్తున్నారని విమర్శించారు. ఏదైనా చట్ట రూపకల్పన చేసే ముందు ప్రతిపక్షాలు, ఆయా సంఘాల నేతలు, మేధావుల అభిప్రాయాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకుంటాయన్నారు. కానీ మూడు వ్యవసాయ చట్టాల రూపకల్పనలో అంబానీ, అదానీ చెప్పినట్టే ప్రధాని చేశారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మోడీ సర్కారు వచ్చే వరకు దేశ అప్పు రూ.65 లక్షల కోట్లుంటే...ఈ తొమ్మిదేండ్ల కాలంలో దాన్ని రెట్టింపు చేశారన్నారు. హిందూత్వం పేరు చెప్పి 100 కోట్ల హిందూవులను మోసం చేస్తున్న పెద్ద ద్రోహి మోడీ అని విమర్శించారు. మోడీ హఠావో..దేశ్‌కీ బచావో అని పిలుపునిచ్చారు.
మోడీ సర్కార్‌ను గద్దె దింపాలి : మల్లు లక్ష్మి
గ్యాస్ సిలిండర్, నిత్యావసరాల ధరలను పెంచి మహిళలను ఇబ్బంది పాలు చేస్తున్న మోడీ సర్కారును గద్దె దింపాలని మహిళా లోకానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. దేశంలో రోజురోజుకీ మహిళలపై దాడులు పెరుగుతుండటం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మనుధర్మాన్ని తీసుకొచ్చి మహిళలను వంటింటికి పరిమితం చేసే కుట్రకు బీజేపీ పూనుకుంటున్నదని విమర్శించారు.
ప్రశ్నించే వారిపై దాడులు : పోతినేని
బృంద నాయకుడు, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం, నిత్యావసర ధరలను పెంచడం, ప్రశ్నించే వారిని చంపటం అనే లక్ష్యంతో బీజేపీ ముందుకెళుతున్నదని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శిస్తే సినిమా థియేటర్లను తగులబెడతామంటూ బండి సంజరు వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు అదే సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రాగానే ఆ గొప్పతనమంతా మోడీదేనంట ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. గుజరాత్లో అదానికి ఎకరానికి కేవలం రూ.15 చొప్పున 5 వేల ఎకరాలు ఇవ్వడం వల్ల ఆయన ఆస్తి రూ. 12 లక్షల కోట్లకు చేరిందని విమర్శించారు.
గంగవరం పోర్టును కూడా ఆయన అలాగే స్వాధీనం చేసుకున్నాడని విమర్శించారు. గతంలో రైళ్లు గుద్దితే బర్రెలు చనిపోయేవని ఇప్పుడు మోడీ సర్కార్‌లో బర్రెలు గుద్దితే రైళ్లు పాడైపోతున్నాయని విమర్శించారు. సీసీఐకి లక్ష రూపాయలు కేటాయిస్తే పత్తి కొనుగోలు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. పత్తి కొనుగోలు బాధ్యతలను ఉంచి కేంద్రం పక్కకు తప్పుకుందన్నారు. ఎరువుల సబ్సిడీలకు కోత పెట్టిందన్నారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, సూర్యాపేట సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) రాష్ట్ర, ఖమ్మం, సూర్యాపేట జిల్లా నాయకులు పాల్గొన్నారు. కోదాడలో జనచైతన్య యాత్రకు టీడీపీ నాయకులు స్వాగతం చెప్పారు.