Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీతో సీఎం చర్చలు జరపాలి : తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరైందికాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వారి సమస్యలపై ప్రభుత్వం వివక్ష చూపకుండా తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఆర్టిజన్లుగా ఉన్నవారిని కన్వర్షన్ చేయాలని, కనీసం 30 శాతమైన ఫిట్మెంట్ ఇవ్వాలని, గత 20 ఏండ్లుగా సంస్థను నమ్ముకుని పని చేస్తున్న రెవెన్యూ క్యాషియర్స్, స్పాట్ బిల్డింగ్ కార్మికులు, అన్‌మెన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని కోరారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపి వారి సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని సూచించారు. గతేడాది ఏప్రిల్ నుంచి వేతన ఒప్పందం జరగాల్సి ఉండగా, నేటికీ ఆ ఊసే లేకపోవడంతో సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2021 అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 23 వేల మందిని రెగ్యులర్ చేసామంటూ ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఆచరణలో కాంట్రాక్టు కార్మికుల నుంచి ఆర్టిజన్లుగా మాత్రమే గుర్తించారు తప్ప వారిని రెగ్యులరైజ్ చేయలేదని తెలిపారు. నాలుగేండ్లకోసారి ఇచ్చే ఫిట్‌మెంట్‌ను కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్త్తున్నారని విమర్శించారు.
రాహుల్‌పై అనర్హత వేటు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న మోడీ నియంతృత్వ చర్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖండించింది. పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై సూరత్‌కోర్టు రెండేండ్ల జైలు శిక్ష విధించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పు అమలుపై నెలరోజుల్లో పై కోర్టుకు వెళ్లడానికి కూడా అవకాశమిచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆదేశాలతో రాహుల్‌గాంధీని పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటిస్తూ ఆ సీటు ఖాళీ అయినట్టు లోక్‌సభ సచివాలయం ప్రకటించడం అప్రజాస్వామికమని విమర్శించారు. దేశంలో రాజకీయ ప్రతిపక్షాలను, ప్రతిపక్ష ప్రభుత్వాలను, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నదని తెలిపారు. రాజ్యాంగ సంస్థలైన ఈడీ, సీబీఐని కేంద్రం తన చేతుల్లోకి తీసుకుని దాడులు చేయిస్తూ, అక్రమ కేసులతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న దని విమర్శించారు. బీజేపీలో చేరినవారి కేసులకు క్లీన్చిట్ ఇస్తూ, లొంగనివారిని అరెస్టులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని పేర్కొన్నారు. దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలంటూ పార్లమెంట్లో అన్ని ప్రతిపక్షాలూ నిలదీస్తుంటే, దాన్ని దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ దురహంకార వ్యవహారంలో భాగంగానే రాహుల్‌గాంధీపై నేరపూరిత పరువునష్టం మార్గాన్ని ఎంచుకుని, పార్లమెంట్ సభ్యత్వాన్ని తొలగించే దుశ్చర్యకు బీజేపీ ప్రభుత్వం పూనుకున్నదని విమర్శించారు. ఈ నిరంకుశ, ఫాసిస్టు పాలనవల్ల దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. బీజేపీ-ఆర్ఎస్ఎస్ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఖండించాలని ఆయన కోరారు.