Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీజీ... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ...?
- దేశంలో ఉన్నది 'మోదానీ' సర్కారు :జనచైతన్య యాత్రలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జూకృష్ణన్
నేరేడుచర్ల నుంచి బి.బసవపున్నయ్య
దేశంలో దొంగలను దొంగ అన్నా...అలాంటి వారిని విమర్శించినా జైలుకు పంపుతున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు విజ్జూకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు... ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న కొలువులను ఊడబెరుకుతున్నదని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌ను ప్రస్తుతం 'మోదానీ' ప్రభుత్వం పరిపాలిస్తున్నదని విమర్శించారు. దొంగలకు ఆశ్రయం కల్పిస్తున్న బీజేపీ సర్కారు... అలాంటి వారికి మంత్రి పదవులను కట్టబెడుతున్నదని విమర్శించారు. అంబానీ, అదానీలతో కలిసి మోడీ దేశాన్ని దోపిడీ చేస్తున్నారని నిరసించారు. సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్ర పదో రోజైన ఆదివారం సూర్యాపేట జిల్లా హూజూర్ నగర్, నేరేడుచర్లలో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మోటార్ సైకిల్ ర్యాలీలో విజ్జూకృష్ణన్ పాల్గొన్నారు. నేరేడుచర్ల చౌరస్తాలో సీపీఐ (ఎం) పట్టణ కార్యదర్శి కె.నగేష్ అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను దోచి, కార్పొరేట్లను మేపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మోడీ పాలనకు వ్యతిరేకంగా అందరూ ఐక్యం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. విదేశాల్లోని నల్లధనాన్ని తెప్పించి... ఒక్కో భారతీయుడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మోడీ, ఇప్పుడా హామీని బుట్టదాఖలు చేశారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ చట్టం కింద 200 రోజుల పని కల్పించాలనీ, అయితే ఆచరణలో కేవలం 50 రోజులకే దాన్ని పరిమితం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2014 నుంచి 2022 వరకు రైతులు, వ్యవసాయ కార్మికులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారనీ, ఇవన్నీ మోడీ ప్రభుత్వ హత్యలేనని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని ప్రజాస్వామ్యంపై ప్రస్తుతం దాడి జరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రైతు ఉద్యమం చారిత్రాత్మకమని చెప్పారు. నాసిక్ నుంచి ముంబయి వరకు నిర్వహించిన లాంగ్మార్చ్తోపాటు ఢిల్లీలో సరిహద్దుల్లో జరిగిన రైతు పోరాటాలు దేశానికి దిక్చూచి నిలిచాయని గుర్తు చేశారు. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా విజ్జూకృష్ణన్ గుర్తు చేశారు. ఏప్రిల్ ఐదున రైతులు, కార్మికులతో దేశ రాజధాని ఢిల్లీలో భారీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వివరించారు. ప్రత్నామ్నాయ పోరాటాలను బలోపేతం చేయటంలో భాగంగానే జనచైతన్య యాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు: పోతినేని
జనచైతన్య యాత్ర బృంద నాయకుడు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ... మోడీ దేశ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నేరవేర్చలేదన్నారు. పేదలకు పూర్తిస్థాయిలో ఇండ్లు ఇస్తామనే వాగ్దానం ఊసే లేదని గుర్తు చేశారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే మాట నీటి మూటే అయిందని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేస్తూ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. దేశ ఆస్తులను అప్పనంగా అంబానీ, ఆదానీలకు తెగనమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల మీద అనేక రకాల పన్నులు విధిస్తూ నిత్యావసర ధరలను విపరీతంగా పెంచుతున్నారని వ్యాఖ్యానించారు. తద్వారా సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ప్రధాని మోడీ నేతృత్వంలో దుర్మార్గపు పాలన సాగుతున్నదని విమర్శించారు. పలు రాష్ట్రాల్లో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చివేశారని గుర్తు చేశారు. మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. వారికి చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును తొక్కిపెడుతున్నారని విమర్శించారు.
అంధకారంలో ప్రజల భవిష్యత్తు : జూలకంటి
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 135 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దనోట్లను రద్దుచేసిన మోడీ, దేశంలో నల్లధనం పెరగడానికి కారణమయ్యారని విమర్శించారు. ఆ సందర్భంగా అనేక మంది సామాన్యులు చనిపోవడం దారుణమని తెలిపారు. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్న బీజేపీ సర్కారును ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ఉత్తర భారతంలో రైతాంగం ఐక్యమై 13 నెలలపాటు కఠోర పోరాటం చేసి... మోడీ తెచ్చిన మూడు వ్యవసాయ నల్లచట్టాలను తిప్పికొట్టారని గుర్తు చేశారు. పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వలేని మోడీ దుర్మార్గుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, టీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి చిత్తలూరి సైదులు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు, మండల కార్యదర్శి సిరికొండ శ్రీను, నాయకులు కోట రమేశ్, నవీన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.