Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి, మత వాదాలు కాదు రైతువాదం కావాలి
- మా పథకాలను అమలు చేసే దమ్ముందా ?
- తెలంగాణ తరహాలో అభివృద్ధి చేస్తే మహారాష్ట్రకు రాను
- మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం:కాందార్ లోహ బహిరంగ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో త్వరలో రైతు తుఫాన్ రాబోతున్నదనీ, దాన్నెవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. మత, జాతి వాదాన్ని విడిచిపెట్టి రైతు వాదంతో ముందుసాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ తరహాలో మహారాష్ట్రలో అభివృద్ధి చేస్తే ఆ రాష్ట్రంలో అడుగుపెట్టబోనని ఆయన స్పష్టం చేశారు. మహనీయులు పుట్టిన మహారాష్ట్ర గడ్డ విప్లవాలకు చిరునామా అని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న కీలక పథకాలను అమలు చేసే దమ్ము మహారాష్ట్ర సర్కారుకుందా? అని సవాల్ విసిరారు. ఆదివారం మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సభా వేదిక మీద ఏర్పాటు చేసిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్, బసవేశ్వరుడు, డాక్టర్ బీఆర్.అంబేద్కర్, అన్నా బాహు సాతే, మహాత్మా ఫూలే, అహిల్యాబాయి హౌల్కర్, తదితర మహనీయుల విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 'మహారాష్ట్రలో ఏం పని అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రశ్నిస్తున్నారు. నేను భారత పౌరుడిగా ప్రతిరాష్ట్రంలోనూ పర్యటిస్తా. నేను భారతదేశ బిడ్డను. తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నాం. పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తున్నాం. మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా రాష్ట్రంలో దళిత బంధు అమలు చేస్తున్నాం. దళిత వజ్రం, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుట్టిన గడ్డపై దళిత బంధు ఎందుకు అమలు చేయరు? తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటా' అని స్పష్టం చేశారు. 'స్వాతంత్య్రమొచ్చి 75 ఏండ్లయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్, బీజేపీలతో మన బతుకులు మారాయా? రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు? నేను చెప్పేది నిజమో? అబద్ధమో? మీరే ఆలోచించండి' అని ప్రజలకు సూచించారు. ఫసల్ బీమా ఎవరికైనా అందుతా అని ప్రశ్నించారు. ఆ పథకమే ఒక నాటకమని విమర్శించారు.
'హర్యానాలో భూమిపుత్రుడు చోటురామ్ నుంచి మహేంద్రసింగ్ టికాయత్ వరకు, బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ నంజుండ స్వామి నుంచి ఇక్కడ శరత్ జోషి కాలం వరకు రైతుల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అశోక్థావలే నేతృత్వంలో రైతులు నాసిక్ నుంచి ముంబయి వరకు పది వేల మంది పాదయాత్ర చేశారు. అహ్మద్‌నగర్‌కు చెందిన దశరథ్ సావంత్ కాకా 84 ఏండ్ల వయస్సులోనూ ఇంకా పోరాడుతూ ఉన్నారు. ఉల్లి, చెరుకు, ఇలా అన్ని పంటలకూ మద్దతు ధర కోసం ఏటా మనం ఎందుకు పోరాటం చేయాల్సి వస్తోంది ? రోడ్లపైకి ఎందుకు రావాల్సి వస్తున్నది? ఈ ఒక్క విషయం గురించి మీరు ఆలోచించండి చాలు. రైతన్నలు రోడ్డెక్కుతుంటే... మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎక్కడ పడుకుంటున్నారు? నాది ఒక్కటే విన్నపం... మీరు జీవితకాలం పోరాడుతూనే ఉంటారా? ఢిల్లీలో 13 నెలల పాటు జరిగిన రైతాంగ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయినా ప్రధాని నోరు తెరవలేదు. ఎన్నికలు వస్తే మాత్రం ఆయన కథ వేరుగా ఉంటుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఎన్నికలు వస్తే తీయ తీయటి మాటలతో రైతులకు క్షమాపణ చెప్పాడు మన ప్రధాని. మనం పిచ్చివాళ్ళం. అబద్దపు కథలు విని తిరిగి ఓట్లు వేశాం. ఏమైనా ఫలితం వచ్చిందా?' అని ప్రశ్నించారు. ' రైతులు, కార్మికులు, దళిత బిడ్డలకు నేను ఒక్కటే విషయం చెప్తున్నాను. మనం ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికో ఓటు వేసి.. దరఖాస్తులు పట్టుకొని బిచ్చగాళ్ళలా వారి వెంట పడడమెందుకు ? మనమే స్వయంగా ఎమ్మెల్యేలమవుదాం. ఎంపీలమవుదాం. మనలో ఆ బలం లేదా? మన చేతిలో ఓటు అనే తాళం చెవి ఉంది. దాన్ని ఉపయోగిద్దాం. ఎప్పటిదాకా మనం కులం, మతం పేరు మీద విభజింపబడి పాలింపబడతామో అప్పటిదాకా మనం ఇలాగే మదనపడాల్సి వస్తుంది. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది. మనం ఏకమై ముందుకుపోతే మంచి ఫలితాలు వస్తాయి' అని చెప్పారు.
మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం..
'అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకుంది. కాంగ్రెస్ 54 ఏండ్లు, బీజేపీ 14 ఏండ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నది. మహారాష్ట్రలో కృష్ణా, గోదావరి నదులున్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? సాగు, తాగు నీరు చాలాచోట్ల అందుబాటులో లేదు. మన కండ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతున్నది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరివ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దాని ద్వారా 24 గంటల పాటు విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు. 125 ఏండ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గున్నా కరెంట్‌ను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పీఎం కిసాన్ కింద రూ.6 వేలు కాదు..కనీసం రూ.10 వేలు ఇవ్వాలి. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ. ఇన్నేండ్లు నేతల మాయమాటలకు మోసపోయాం. ఇక మేల్కొందాం. మహారాష్ట్ర ప్రజల్లారా. నాతో కలిసి రండి. నీళ్ల కోసం కొట్లాడుదాం' అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. త్వరలో మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీచేస్తుందనీ, బీఆర్ఎస్ జెండాను ఎగురేస్తామని నొక్కి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు శంకరన్న ధోండ్గే, మాజీ ఎంపీ హరిభావ్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ జాదవ్, డాక్టర్ వసంత రావు బోండే, దళిత నేత సురేష్ గైక్వాడ్, రాష్ట్ర నాయకులు నాగ్ నాథ్ ఘిసేవాడ్, యశ్ పాల్ భింగే, జకీర్ చావ్స్, మాజీ జెడ్పీ చైర్మెన్ ప్రహ్లాద్ రొఖండో, దీపక్ అరవింద్ కాంతే తోపాటు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. వారికి కేసీఆర్ గులాంబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బహిరంగ సభలో ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్, దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, షకీల్ అహ్మద్, బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షులు గుర్నామ్ సింగ్, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హిమాంశు తివారి, ఒడిషా బిఆర్ఎస్ నాయకుడు అక్షరు కుమార్, మాజీ ఎమ్మెల్యే దీపక్ అథ్రమ్, మాజీ ఎంపీ హరిబన్ రాథోడ్, టీఎస్ఐఐసీ చైర్మెన్ గ్యాదరి బాలమల్లు, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అమృత్ లాల్ చౌహాన్, భాస్కర్ గుడాల, రాఘవ తదితరులు పాల్గొన్నారు.