Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీకి వ్యతిరేకంగా ఉన్నంతకాలం బీఆర్ఎస్ను సమర్థిస్తాం : సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రలో తమ్మినేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా జన చైతన్య యాత్రను చేపట్టినట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. 2023 ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జన చైతన్య యాత్ర బహిరంగసభ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ వాగ్దానాలను అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించారు. అవినీతిరహిత పాలన అందజేస్తామని చెప్పిన బీజేపీ సర్కార్ గుండుగుత్తగా ప్రజల ఆస్తులను అంబానీ, ఆదానీలకు పంచిపెడుతోందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి తొమ్మిదేండ్లవుతున్నా ఆ వాగ్ధానం అమలు చేయలేదని అన్నారు. ఏడాదికి రెండు కోట్ల చొప్పున తొమ్మిదేండ్లలో 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా 18 వేల కొలువులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తామని చెప్పిన ప్రధాని ఒక్క ఇల్లును ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చెప్పి నెరవేర్చలేదని అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీ పోరాటం ద్వారా నల్ల రైతు చట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సందర్భంగా 760 మంది చనిపోయినా వెనక్కి తగ్గలేదని వివరించారు. బుల్లెట్ రైలును మరిచిపోవాల్సిందేననీ, బ్యాంకుల్లో రూ.15 లక్షల సొమ్మును వేస్తామని చెప్పి దేశప్రజలను మోసం చేశారని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వం తప్పులు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ ఉన్నంత కాలం, ప్రజానుకూల విధానాలు అమలు చేస్తున్నంత కాలం బీఆర్ఎస్ను సమర్థిస్తామని ఈ సందర్భంగా తమ్మినేని చెప్పారు. దేశంలో దుర్మార్గమైన మనుధర్మాన్ని అమలు చేసే ప్రయత్నం జరుగుతోందనీ, దీన్ని అడ్డుకుంటామని చెప్పారు. రిజర్వేషన్లు కావాలని బీసీలు, మహిళలు ఎప్పటినుంచో అడుగుతున్నారనీ, మోడీ ప్రభుత్వం మాత్రం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీని ఓడించేందుకు దేశంలో లౌకిక ప్రజాస్వామ్య శక్తులను కూడగడతామని చెప్పారు.
నితీష్ కుమార్, అఖిలేష్ యాదవ్, కేసీఆర్, స్టాలిన్, కేజ్రీవాల్ తదితర ప్రతిపక్షాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు కలిసి వస్తున్నారని చెప్పారు. వచ్చే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో పోటీ చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్తో ఎన్నికల అవగాహన కుదుర్చుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. పేపర్ల లీకేజీ మూలంగా అర్హులైన నిరుద్యోగ యువతకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
మిర్యాలగూడ మహా 'జనచైతన్య' సంద్రం
సీపీఐ(ఎం) జన చైతన్య యాత్రలో భాగంగా మిర్యాలగూడలో వందలాది మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు ఈ ర్యాలీ జరిగింది. బైక్లు, కార్లు, ఇతర వాహనాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానంగా విద్యార్థులు, యువత, మహిళలు ఎర్ర చొక్కాలు ధరించి ర్యాలీకి హాజరయ్యారు. మిర్యాలగూడలో ఎటు చూసినా ఎర్రజెండాలే కనిపించాయి. పట్టణమంతా ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఎరుపెక్కింది. ఎన్ఎస్పీ క్యాంప్ ప్రాంగణంలో బహిరంగ సభ జరిగింది. రెండు గంటల పాటు జరిగిన ఈ సభకు మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలివచ్చారు. ముఖ్యంగా ముస్లీం మైనార్టీలు, కాంట్రాక్టు వర్కర్లు, ఉద్యోగులు, టీచర్లు జన చైతన్య యాత్ర బృందానికి తమ సమస్యలపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం, విజ్జు కృష్ణన్, పోతినేని సుదర్శన్ రావు, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి తదితరులను స్థానిక పార్టీ శ్రేణులు సన్మానించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో విజ్జు కృష్ణన్, పోతినేని సుదర్శన్, మల్లు లక్ష్మి, జూలకంటి రంగారెడ్డి మాట్లాడారు.