Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఉపాధ్యక్షులు టి జ్యోతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహిళా వికలాంగుల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షులు టి జ్యోతి డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్లో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ), తెలంగాణ మహిళా వికలాంగుల సంఘం ఆధ్వర్యం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ మహిళా వికలాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అసమానతలు, వారి హక్కుల కోసం జరగాల్సిన మహిళా దినోత్సవాన్ని పాలకవర్గాలు తప్పుదారి పట్టిస్తున్నాయ ని చెప్పారు. దేశంలో మహిళలపై వివక్షత మరింత పెరుగుతుందనీ, అందులో మహిళా వికలాంగులపై వివక్షత , లైంగిక వేధింపులు , దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. చట్టసభల్లో మహిళల కు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. గత తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మహిళా రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కార్యక్రమంలో తెలంగాణ మహిళా వికలాంగుల సంఘం రాష్ట్ర కోకన్వీనర్ కే నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఎన్పీఆర్డీ రాష్ట్ర అధ్యక్షులు కె. వెంకట్, మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ సాయమ్మ, మహిళా విభాగం నాయకులు సావిత్రి , షైన్ బేగం, లలిత, కుసుమ, సత్తెమ్మ, ఉష, సరిత, కోశాధికారి ఆర్.వెంకటేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, ఉపేందర్, దశరథ్ నాయకులు భుజంగరెడ్డి, రాజశేఖర్ పాల్గొన్నారు.