Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్ఆర్టీసీలో సుదీర్ఘకాలం తర్వాత 'వెన్నెల' ఏసీ స్లీపర్ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. సోమవారం ఎల్బీనగర్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్, టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ వీటిని ప్రారంభించనున్నారు. మొదటి విడతగా 16 ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. ఇవి కర్ణాటకలోని బెంగుళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై రూట్లలో నడుస్తాయి. ఇటీవల కాలం చెల్లి తుక్కు కింద మారిన బస్సుల స్థానంలో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 8 నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను ఆర్టీసీ యాజమాన్యం ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటికి ప్రయాణీకుల నుంచి మంచి స్పందన వస్తున్నదనీ, ఈ నేపథ్యంలోనే దూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం అత్యాధునిక హంగులతో కొత్త ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈ బస్సులకు 'లహరి-అమ్మఒడి అనుభూతి' అని పేరుపెట్టారు. ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై సదుపాయం ఉంటుంది. బస్ ట్రాకింగ్ సిస్టం, ప్యానిక్ బటన్ సదుపాయం ఉంటాయి. ఇవి టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసి ఉంటాయి. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో మొత్తం 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్‌ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం(ఎఫ్ డీఏఎస్) ఏర్పాటు చేశారు. బస్సులో మంటలు చెలరేగగానే వెంటనే ఇది అప్రమత్తం చేస్తుంది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా ఈ బస్సుల్లో ఉంటుంది.