Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నించినందుకే రాహుల్‌పై అనర్హత వేటు : గాంధీభవన్ వద్ద దీక్షలో రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలోని సహజ వనరులను అదానీకి కట్టబెడుతున్నారంటూ రాహుల్ గాంధీ మోడీ సర్కార్‌ను ప్రశ్నించినందుకే ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. బ్రిటీష్ పాలకుల మాదిరిగా విభజించు...పాలించు విధానాన్ని అమలు చేస్తున్న బీజేపీ అంటే 'బ్రిటీషర్స్ జనతా పార్టీ' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దీక్షా శిబిరంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతాలు, ప్రాంతాలు, కులాలు, భాషల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని ఆరోపించారు. బ్రిటీషర్లను తరిమికొట్టిన చరిత్ర కాంగ్ఱ్రెస్ పార్టీదని తెలిపారు. సర్దార్ పటేల్‌కు బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలంటూ అమిత్‌షాను ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ను సర్దార్ పటేల్ నిషేధించారని గుర్తుచేశారు. గాంధీ భవన్ నిర్మాణానికి పునాదులు వేసింది ఆయనేనని గుర్తుచేశారు. నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటీషర్లు సహజ వనరులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు బ్రిటిష్ జనతా పార్టీ ఆధ్వర్యంలో అదే సూరత్ నుంచి అదానీ కంపెనీ బయలుదేరిందని ఎద్దేవా చేశారు. ప్రధాని నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారన్నారు. బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అంటే ఆదానీ, ప్రధాని అని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకనే అనర్హత వేటు వేశారని రేవంత్ తెలిపారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తున్నదని విమర్శించారు. సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ, గాంధీ కుటుంబం కోసం, దేశం కోసం అందరూ కాంగ్రెస్‌తో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షా శిబిరంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, మాజీ సీఎల్పీ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
నేడు సత్యాగ్రహ దీక్షలు
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటుకు నిరనసగా సోమవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని గాంధీ విగ్రహం లేదా అంబేద్కర్ విగ్రహాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేయనున్నట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మెన్ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో ఆదివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతుగా నిలవాలని కోరారు.