Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది కమ్యూనిస్టుల రక్తంతో తడిచిన గడ్డ
- లౌకిక విధానాన్ని వ్యతిరేకించే మతోన్మాదులను తరిమికొడుదాం :
వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల జనచైతన్య యాత్రలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ
నవతెలంగాణ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధులు / మహబూబ్‌నగర్
లౌకిక రాజ్యంలో అసమానతలకు తావు లేని రాజ్యాంగాన్ని చెరిచి మతోన్మాద మనుస్మతిని అమలులోకి తేచ్చేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, తెలంగాణలో మోడీ-షాల కుట్రలు సాగవని, వారిని తరిమికొట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఇది కమ్యూనిస్టుల రక్తంతో తడిచిన గడ్డ అని, ఇక్కడ మనువాదులకు స్థానం లేదని స్పష్టం చేశారు. జాన్‌వెస్లీ ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ(ఎం) జన చైతన్య యాత్ర 3వ బృందం ఆదివారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట ప్రవేశించింది. యాత్రకు ఘన స్వాగతం పలికిమోమిన్పేట నుంచి వికారాబాద్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడి నుంచి పరిగికి యాత్ర వెళ్లింది. అక్కడ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం కుల్కచర్లకు అక్కడి నుంచి మహబూబ్‌నగర్ పట్టణానికి చేరుకుంది. ఆదివారం రాత్రి అక్కడే బస చేయనుంది. వికారాబాద్, మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభల్లో జాన్‌వెస్లీ మాట్లాడారు. ఎన్నికల ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందన్నారు. విదేశాల్లో ఉన్న స్వదేశీ డబ్బులు తెప్పించి ప్రజలకు పంచుతామని గొప్పలు చెప్పిన మోడీ దేశ సంపదను తన కార్పొరేట్ అనుచరులకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలుచేయకపోగా, ఉన్న ఉద్యోగాలు తొలగించి నిరుద్యోగం పెరగడానికి కారకులయ్యారని ఆరోపించారు. 16 పరిశ్రమలు మూసివేసి లక్షలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమాన్ని తుంగలో తొక్కి వారి బతుకులు దిగజార్చుతున్నారన్నారు. దేశంలో మత విద్వేశాలను రెచ్చగొట్టి.. కుల, మతల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందేందుకు పన్నాగాలు పన్నుతుందని తెలిపారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. వాటి అభివృద్ధికి సంకెళ్లు వేస్తోందన్నారు. తెలంగాణలో మతోన్మాదులను ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
రైతులపై విద్యుత్ భారం మోపేందుకు కుట్ర : టీ.సాగర్, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
రైతులపై భారం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.. సాగర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. కేంద్రం తీసుకువస్తు న్న విద్యుత్ సంస్కరణలతో రైతులపై విద్యుత్ భారం పడనుందన్నారు. రైతు పండించిన పంట కొనుగోలు చేసే వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కాగా, మోడీ ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మద్దతు ధర కల్పిస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చి నేటికీ అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని దేశ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఉపాధి హామీ చట్టాన్నీ నీరుగార్చేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.30వేల కోట్ల నిధులు తగ్గించిందన్నారు. అన్నిరంగాల ప్రజల జీవన స్థితిగతులను దెబ్బగొట్టేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలందరూ చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు.
దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచి పెడుతున్నారు : వెంకట్రాములు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను లూటీ చేస్తూ మోడీ అనుచరులైన అదానీ, అంబానీలకు దోచి పడుతున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్రాములు అన్నారు. దేశంలో ఆకలి చావులు పెరుగుతున్నాయని అవేదన వ్యక్తం చేశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే సుస్తిరమైన పాలన వస్తోందని చెప్పారని, కానీ నేడు అస్తిరమైన పాలన కొనసాగు తుందని తెలిపారు. నిత్యవసర ధరలు నాలుగు రెట్లు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీ తెలంగాణ ఎంపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కనీసం పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హౌదా తీసురాలేని అసమర్థులని విమర్శించారు. మత చిచ్చుతో రాజకీయం చేయాలని చూస్తున్న బీజేపీ ఆటలు తెలంగాణలో సాగావని హెచ్చరించారు.