Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ చార్జీలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం
- విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
పీక్ సమయంలో 20శాతం విద్యుత్ చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ నిర్ణయంతో సామాన్యున్ని విద్యుత్ వినియోగం నుంచి దూరం చేయడమేనని కేంద్రంపై నిప్పులు చెరిగారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పేదోడిపై పడే ఏ భారాన్ని అయినా ఒప్పుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ట్రూ అప్ చార్జీల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రూ అప్ చార్జీలు పెంచాలంటూ ఈఆర్సీ సిఫారసు చేసినా పట్టించుకోకుండా రూ.12,000 కోట్ల అదనపుభారాన్ని భరించయినా సామాన్యుడి మీద భారం పడకుండా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. పీక్ డిమాండ్ అంటే ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వినియోగదారుడు ఎక్కువగా విద్యుత్ ఉపయోగించే సమయమని తెలిపారు. ఈ సమయాల్లో విద్యుత్‌ను ఎక్కువగా వినియోగించే వినియోగదారులపై భారం మోపుతామంటూ కేంద్రప్రభుత్వం తాఖీదులు జారీ చేస్తే భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. పీక్ డిమాండ్‌లో 20శాతం పెంచడమంటే అటు గృహ వినియోగదారులతో పాటు పారిశ్రామికవేత్తలపై మోయలేని భారం మోపినట్టవుతుందని తెలిపారు. 2014 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే దేశంలో విద్యుత్కాంతులు ప్రసరింపజేస్తామంటూ ప్రగల్బాలు పలికి అధికారంలోకి వచ్చిన మోడీసర్కార్ ఇప్పుడు విద్యుత్ వినియోగం నుంచి సామాన్యుడిని దూరం చేసే కుట్రలకు తెర లేపిందని విమర్శించారు. విద్యుత్ జీవితంలో భాగమైందని, విద్యుత్‌ను వినియోగించకుండా ఉండలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయన్నారు. అటువంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు ఎత్తివేసే చర్యలకు బీజేపీ ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేసిందని ఆరోపించారు. తెలంగాణలో పెట్టిన ప్రతి కనెక్షన్‌కు మీటర్ పెట్టాలన్న కేంద్రప్రభుత్వ సిఫార్సులను వ్యతిరేకించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ఫెర్పార్మెన్స్తో రావాల్సిన అప్పులను మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు. అందులో భాగంగానే ఎఫ్ఆర్బీఎంకు ఇచ్చే పరిమితుల్లో మోకాలొడ్డుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదల పక్షంగానే ఉంటుందన్నారు. పీక్ డిమాండ్ సమయంలో 20శాతం చార్జీలు పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫార్స్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. జేబులకు చిల్లులు పెట్టడం.. ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని ఆరోపించారు. అటువంటి దుర్మార్గాలకు చెల్లు చీటి పాడి మోడీ పాలనకు చరమగీతం పాడే రోజులు ఎంతో దూరం లేవని హెచ్చరించారు.