Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో ఘటన
నవతెలంగాణ-నల్లగొండ
పురిటి నొప్పులు అధికమై బాత్రూమ్కు వెళ్లిన సమయంలోనే ఓ గర్భిణి అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన బుధవారం రాత్రి నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. నిడమనూరు మండలం ధర్మపురం గ్రామానికి చెందిన గర్భిణి పార్వతమ్మ మూడ్రోజుల కిందట పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిలో చేరింది. మొదటి కాన్పులో సాధారణ డెలివరీ అయిందని, రెండో కాన్పు కూడా నార్మల్ డెలివరీ అవుతుందని డాక్టర్లు చెప్పారు. డెలివరీకి ఇంకా సమయం ఉందన్నారు. అయితే, కొద్దిసేపటికే ఆ గర్భిణి బాత్రూంకు వెళ్లింది. ఈ క్రమంలో అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది పుట్టిన బాబును వెంటనే ఐసీయూకి తరలించి వైద్యం అందించారు. ఈ సందర్భంగా గర్భిణి బంధువులు మాట్లాడుతూ.. మధ్యాహ్నం 3 గంటల నుంచి తమ కూతురు నొప్పులతో బాధపడుతున్నా వైద్యులు పట్టించుకోలేదని తెలిపారు. నొప్పులు అధికమవడంతో బాత్ రూమ్‌లోనే బాబుకు జన్మనిచ్చిందని తెలిపారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.