Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలోని మిథుల ప్రాంగణంలో గురువారం నిర్వహించిన రాములోరి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు ఈ కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మహోత్సవానికి హాజరై పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అర్చక స్వాములు సంప్రదాయ బద్ధంగా ఈ కళ్యాణ క్రతువును ఘనంగా జరిపించారు. వేకువజామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చక స్వాములు ముందుగా స్వామివారికి సుప్రభాత సేవ జరిపారు. అనంతరం ఆరాధన, ఆరాగింపు నిర్వహించారు. తొలుత ఆలయంలో ధృవమూర్తులకు ప్రత్యేక పూజలు జరిపారు. ఉదయం 8గంటల నుంచి 9 గంటల వరకు ప్రధానాలయంలో మూలవిరాట్‌కు సంప్రదాయబద్దంగా కల్యాణం నిర్వహించారు. అనంతరం సీతారాములను ఊరేగింపుగా భక్తుల కోలాటాలు, భాజా భజంత్రీల సందడి, సన్నాయి మేళాల నడుమ మిథుల ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. ముందుగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం జరిపారు. సీతారాముల వారి గోత్రనామాలను పఠిస్తూ ప్రవర క్రతువును కొనసాగించారు. సీతమ్మ వారికి యోక్త్రధారణ చేశారు. రాములవారికి యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. 12 గంటలకు అభిజిత్ లగం నందు అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్యధారణ జరిపించారు. భక్త రామదాసు వారు చేయించిన బంగారు ఆభరణాలు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి కల్యాణం సందర్భంగా ధరింప చేశారు. కల్యాణం జరుగుతున్నంత సేపు అర్చకులు కల్యాణం విశిష్టతను మైకులు, రేడియో, టీవీల ద్వారా సందర్శకులకు తెలియజేశారు. ఇదిలా ఉండగా భద్రాచలం పట్టణంలో అనేక కూడళ్లలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సందర్శకులకు అన్నదానం చేశారు. మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు, పానకం తదితర వాటిని అందజేశారు. కాగా, కల్యాణ మహౌత్సవంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తప్ప మరే మంత్రి కూడా హాజరు కాకపోవటం గమనార్హం. ఈసారీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ ఉత్సవానికి హాజరు కాలేదు. త్రిదండి చిన్న జీయర్ స్వామి కళ్యాణానికి హాజరై రామయ్య భక్తి భావాన్ని ఉపదేశం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ దగ్గరుండి కల్యాణం ఏర్పాట్లను చేశారు. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి రమాదేవి ఆలయపరంగా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు రెండువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవి చంద్ర, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత, తదితరులు హాజరయ్యారు.