Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ సాహితి సంస్థ సంతాపం
నవతెలంగాణ- హన్మకొండ
ఓరుగల్లుకు చెందిన ఐదు దశాబ్దాల ప్రముఖ సాహితీవేత్త, కవి, న్యాయవాది నమిలికొండ బాల కిషన్‌రావు(73) గురువారం హన్మకొండలోని ప్రయివేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన ఇంటికే పరిమితమయ్యారు. హనుమకొండ సాహితీపరులకు కొండంత అండదండగా నమిలి కొండ రాష్ట్రవ్యాప్తంగా పరిచితులు. చైతన్య సాహితి, సాంస్కృతిక సమాఖ్య, సాహితీ సమితి, పోతన విజ్ఞాన పీఠం, కాళోజీ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులుగా, రాజరాజ నరేంద్ర భాషా నిలయంలో క్రియాశీల సభ్యునిగా విశేష సేవ అందించారు. ప్రసారిక మాసపత్రిక ద్వారా నూతన తరానికి వేదిక కల్పించారు. సాహితీ సమితి వేదిక అధ్యక్షులుగా కూడా పనిచేశారు. కరీంనగర్ జిల్లా పూడూరులో నమిలికొండ నారాయణరావు, రత్నబాయి దంపతులకు నలమలి కొండ బాలకిషన్‌రావు 1950 సెప్టెంబర్ 6న జన్మించారు. ఎంఏ, ఎల్ఎల్బీ, పట్టభద్రుడైన బాలకిషన్ హనుమకొండలో న్యాయవాద వృత్తి చేపట్టారు. వర్ధమాన రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 1982లో ప్రసారిక మాసపత్రికను నెలకొల్పారు. దాంతోపాటు ఆయన స్వీయ రచనలైన యువస్వరం (1981), అక్షర చిత్రాలు (1986), శాంతి సమత (1989) అక్షరాల్లో అనంతం (1990) అక్షర ప్రతిబింబం (2006), ప్రసారకీయ కుసుమాలు(2010) వెలువరించారు. సాహితీ సమితి వేదిక ద్వారా నమలికొండ అధ్యక్షులుగా పొట్లపల్లి శ్రీనివాసరావు కార్యదర్శిగా అనేక సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు నిర్వహించి పుస్తక ప్రచురణలు గావించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కవులకు సాహితీ సమితి ఒక వేదికగా నిలిచింది. ఇలా ఓరుగల్లు సాహితీ శిఖరంగా వెలుగొందిన నమలికొండ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి.జనార్ధన్, కె.ఆనందాచారి ఆయనకు సంతాపం తెలిపారు. అలాగే, పలువురు కవులు, రచయితలు నివాళి అర్పించారు.