Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయుష్షుతో పాటు జీవన ప్రమాణం మెరుగు
- మారథాన్లో పాల్గొంటున్న రోగులు
- ఉద్యోగాలకు అవసరమైన ఫిట్నెస్కు దోహదం
- దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో కార్డియాక్ రిహాబ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య పరిశోధనలు రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. నిన్న అసాధ్యం అనుకున్న అనేక సంగతులు నేడు వాస్తవమవుతున్నాయి. గుండె సంబంధిత రోగులు బతికి బట్టకడితే చాలనుకునే రోజుల నుంచి గుండె శస్త్రచికిత్స చేయించుకున్న వారు సైతం మారథాన్ లాంటి పరుగు పందాల్లో పాల్గొంటూ ఔరా... అనిపించే దశకు వైద్యశాస్త్రం చేరింది. ఈ క్రమంలో రోగుల ఆయుష్షు పెరగ డమే గాకుండా, జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడు తుండటం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాలు పొందే వారిలో కొన్నింటికి అవసరమైన ఫిట్నెస్ కోల్పోయిన వారు సైతం ఆ తర్వాత ఆయా పరీక్షల్లో సైతం అర్హత సాధిస్తున్నారు. 50 సంవత్సరాల నేవీ ఆఫీసర్ ఒకరు హార్ట్ అటాక్ కారణంగా స్టెంట్ వేసుకున్నారు. గుండె కండరాలు బలహీనపడి దాని పంపింగ్ సామర్థ్యం 40 శాతానికి పడిపోయింది. దీంతో ఉద్యోగం చేయగల సామర్థ్యం అతను కోల్పోయినట్టుగా అధికారులు నిర్దారించారు. కార్డియాక్ రిహాబ్ తర్వాత అదే వ్యక్తి సంబంధిత పరీక్షలో అర్హత సాధించారు. ఇలాగే పలువురు రిహాబ్తో సంతోషకరమైన కొత్త జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇదంతా కార్డియాక్ రిహాబ్ పుణ్యమే. దాని ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో గుండె పంపింగ్ సామర్థ్యం పెరుగుతుండటం గమనార్హం. ఇది భవిష్యత్తులో గుండె జబ్బు వచ్చే అవకాశమున్న రిస్క్ గ్రూప్ వారితో పాటు ఇది వరకే గుండె జబ్బులకు చికిత్స తీసుకుంటున్న వారు, తీసుకున్న వారు, శస్త్రచికిత్స చేయించుకున్న వారికి కూడా ఉపయోగ పడుతుండడం ఆధునిక పరిశోధనలు ఇచ్చిన వరమే అని చెప్పాలి.
కరోనా తర్వాత కాలంలో ఎక్కువ మంది గుండెపోటుకు గురి కావడంతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగు తోంది. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ లెక్కల ప్రకారం ప్రతి రోజు రాష్ట్రంలో 66 మంది గుండెపోటుకు గురవుతూ మరణిస్తు న్నారు. వీరిని సకాలంలో గుర్తించి సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెససిటేషన్) చేయగలిగితే చాలా మంది ప్రాణాల ను నిలుపొచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి ఒక్కరు దీనిపై అవగాహన పెంచు కోవాలంటూ జిల్లాల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. దీనికి తోడు ఉస్మానియా మెడికల్ కాలేజీలో స్కిల్ ల్యాబ్లో వైద్య సిబ్బందికి గుండెతో పాటు ఇతర అత్యవసర పరిస్థితిలో వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణనిస్తున్నారు.
కార్డియాక్ రిహాబ్తో నివారణ
అత్యవసర పరిస్థితి తలెత్తిన తర్వాత సీపీఆర్, ఇతరత్రా జాగ్రత్తలపై ప్రభుత్వపరంగా శిక్షణ కొనసాగుతుంటే, మరోవైపు ప్రయివేటులో అలాంటివి రాకుండా నివారించేందుకు కార్డియాక్ రిహాబ్ వంటి చికిత్సలు అందుబాటులోకి తెస్తున్నాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం డయాబెటీస్, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఆల్కహాల్ సేవించడం, హై బ్లడ్ ప్రెషర్, ఒత్తిడితో కూడిన జీవితం, ఎప్పుడు కూర్చునే ఉండటం, కుటుంబ ఆరోగ్య చరిత్ర, గుర్తించని కారణాలున్న వారికి ఎక్కువగా ఉంటుంది. వీరికి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆంజియో ప్లాస్టీ గానీ, బైపాస్ సర్జరీ చేయడం గానీ చేస్తారు. దాంతో పాటు రోగి కొన్ని ఔషధాలు కూడా వాడాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి కార్డియాక్ రిహాబ్తో భవిష్యత్తులో గుండె జబ్బు రాకుండా నివారించుకునే అవకాశమున్నది. ఈ రిహాబ్ ద్వారా కండరాలు గ్లూకోజ్ తీసుకునే సామర్థ్యం పెరిగి డయాబెటీస్ బారిన పడే ప్రమాదాన్ని తగ్గించుకునే వీలుంది. రిహాబ్ ద్వారా జన్యువుల్లో మార్పుల ద్వారా కూడా వారసత్వ ప్రమాదాలను తప్పించుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వారికి గుండె బాగా గట్టిపడి దాని కండరాల సైజు చిన్నగా మారుతుంది. ఇలాంటి వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం మిగిలిన వారి కన్నా ఎక్కువగా ఉంటుంది. రిహాబ్ తర్వాత కండరాల్లో పాజిటివ్ మార్పులు వస్తున్నట్టు గుర్తించారు. రిహాబ్ తర్వాత శారీరంగా దృఢంగా మారి ఇంటి దగ్గర ఆడుకునే ఆటలు తిరిగి ఆడుకోవచ్చు. రిహాబ్ కావాలనుకునే వారు మరిన్ని వివరాలకు www. CardiacRehab. com సందర్శించవచ్చు.
గుండె జబ్బుల నివారణకు మేలు :డాక్టర్ మురళీధర్ బాబీ
గుండె జబ్బులు, గుండెపోటు పదే పదే వచ్చే రోగులకు ముందుగానే వాటిని నివారించేందుకు కార్డియాక్ రిహాబ్ దోహద పడుతుందని కార్డియాక్ రిహాబ్ స్పెషలిస్టు డాక్టర్ మురళీధర్ బాబీ తెలిపారు. ప్రభుత్వపరంగా రిహాబ్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తే బాగుంటుందని సూచించారు. రిహాబ్ సేవలను ప్రజలకు చేరు వ చేయగలిగితే అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందే నివారించ వచ్చని చెప్పారు.