Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లాలో 15 వంతెనలకు సర్వే
- కేంద్రం నిర్లక్ష్యం, నిధుల లేమితో ముందుకు సాగని పనులు
- తరచూ ప్రమాదాలతో ప్రజల్లో ఆందోళన
- వేల సంఖ్యలో మూగజీవాల మృత్యువాత
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రైల్వే వంతెనల నిర్మాణాలు సర్వేల వద్దే ఆగిపోయాయి.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం.. నిధుల విడుదల లేక వంతెనల నిర్మాణం జరగడం లేదు. వికారాబాద్- తాండూరు మార్గంలో 15 వంతెనలు నిర్మించాలని సర్వే చేసినప్పటికీ నిధులు కేటాయించకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. దాంతో రైల్వే ట్రాక్‌ల వద్ద ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణించాల్సి వస్తోంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. వేలాదిగా మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. రైల్వే బ్రిడ్జీలు లేక వికారాబాద్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కథనం.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సుదూర రైల్వే మార్గం ఉంది. వికారాబాద్ జిల్లాలో 30 ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లు దాటి ఆయా గ్రామాలకు వెళ్లాల్సి ఉంది. కొన్నిచోట్ల గ్రామాలకు వెళ్లే మార్గంలో చెక్ పోస్టులు కూడా లేవు. వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లే మార్గం అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఈ ప్రాంతంలో 15 చోట్ల వంతెన నిర్మాణాలు చేపట్టాలని రైల్వే అధికారులు సర్వే చేశారు. కానీ ఇప్పటి వరకు అతీగతి లేదు. ఇటీవల పలుచోట్ల అండర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేసినా వర్షం వచ్చిందంటే రెండు, మూడ్రోజుల పాటు రాకపోకలు నిలిచిపోతున్నాయి. మోమిన్‌పేట నుంచి కేసారం పోయే మార్గంలో ఏర్పాటు చేసిన అండర్ బ్రిడ్జితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగాడి నుంచి కొంపెల్లి వెళ్లే మార్గంలో రైల్వే వంతెన లేక ప్రయాణికులు రైలు పోయే దాకా నిరీక్షించాల్సి వస్తోంది.
ప్రజల గోడు పట్టని కేంద్రం
ఎన్నో ఏండ్లుగా రైల్వే వంతెనలు నిర్మాణం కోసం ఈ ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నప్పటికీ కేంద్ర ఏమాత్రం స్పందించడం లేదు. ఈ ప్రాంతంలో రైల్వే మార్గంలో జరుగుతున్న ప్రమాదాలను వివరిస్తూ వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ప్రతియేటా బడ్జెట్ సమావేశాల్లో స్థానిక ఎంపీలు మొరపెట్టుకున్నా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇదిలా ఉంటే, వికారాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హయాంలో శాటిలైట్ సిటీ జాబితాలో ఎంపికైంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక స్మార్ట్‌సిటీ జాబితా ప్రకటించింది. దాంట్లో వికారాబాద్‌కు మొండిచేయి చూపింది. వికారాబాద్‌ను ఎంపిక చేయలేదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వికారాబాద్‌ను స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని, రైల్వే వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అలాగే, జిల్లాలో సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)ను ప్రయివేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రైల్వే వంతెనలు ఏర్పాటు చేయాలి
మల్లేశం- సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కార్యదర్శి
రైల్వే వంతెనలు లేకపోవడంతో నిత్యం ఏదో ఒక చోట ప్రమాదం జరుగుతోంది. వేల సంఖ్యలో మూగజీవాలు మృత్యవాత పడ్డాయి. ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. శాటిలైట్ సిటీగా ఎంపికైన వికారాబాద్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చకుండా కేంద్రం వివక్ష చూపింది. తక్షణమే వికారాబాద్‌ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చి అభివృద్ధి చేయాలి.
ప్రజలు ప్రాణం కోల్పోతున్నారు
రంజిత్‌రెడ్డి- చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు
వికారాబాద్ జిల్లాలో రైల్వే మార్గంలో వంతెనల నిర్మాణాలు అత్యవసరం. ఇందుకు నిధులు కేటాయించాలని ప్రతి బడ్జెట్ సమావేశంలోనూ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం. కేంద్రం నిర్లక్ష్యంతో ఈ ప్రాంతంలో ఎన్నో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తక్షణమే నిధులు కేటాయించి, రైల్వే వంతెనల నిర్మాణం చేపట్టాలి.