Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దొరకని పట్టు.. అటకెక్కిక చేరికలు
- రాష్ట్ర పర్యటనకు మొహం చాటేస్తున్న బీజేపీ అగ్రనేతలు
- పలుమార్లు ప్రధాని, అమిత్షా, నడ్డా పర్యటనలు రద్దు
- రాష్ట్ర నాయకత్వం తీరు వల్లనే అంటూ ప్రచారం
- చేరికలు లేకపోవడంపైనా గుస్సా
- 80కిపైగా సీట్లల్లో అభ్యర్థులు కరువు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దక్షిణాదిలో కర్నాటకలో మాదిరిగా చాపకింద నీరులా తెలంగాణలో విస్తరించాలని చూస్తున్న బీజేపీకి ఇక్కడ పప్పులుడకట్లేదు. పట్టు దొరకట్లేదు. భారీ చేరికలంటూ ఆ పార్టీ చేసిన హడావిడి తోకపటాకులాగా తుస్సుమంది. కొద్దికాలం ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ఏదో చేద్దామని చేసిన పర్యటనలు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో పర్యటించేందుకే బీజేపీ అగ్రనేతలు మొహం చాటేస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. పట్టులేని కాడ పాకులాడి పరువు తీసుకోవడం కంటే ఇక్కడకు రాకపోవడమే ఉత్తమం అనే ధోరణిలో నేతలు వ్యవహరిస్తున్నారు. వరుసగా ప్రధాని మోడీ, అమిత్షా, జేపీ నడ్డా పర్యటనల రద్దే దీనికి ఉదాహరణ. రెండు, మూడు నెలలుగా రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటన ఉంటుందనీ, భారీ బహిరంగ సభ ఉంటుందని రాష్ట్ర నాయకులు చెబుతున్నప్పటికీ అది ఎంతకీ ఖరారు కావటంలేదు. సికింద్రాబాద్లో వందేభారత్ రైలును ప్రధాని మోడీ స్వయంగా హాజరై ప్రారంభించాల్సి ఉండగా..ఆయన రాలేదు. వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. నెలకోసారి రాష్ట్రంలో పర్యటిస్తానన్న అమిత్షా ఊసేలేదు. ఇటీవల పర్యటించినా ఆయన అధికారిక కార్యక్రమాలకే పరిమితం అయ్యారు. వాస్తవానికి శుక్రవారం (మార్చి 31న) జేపీ నడ్డా సంగారెడ్డి పర్యటనకు వచ్చి ఆ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, గురువారం సాయంత్రం ఆయన పర్యటన రద్దు అయినట్టు, వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నట్టు రాష్ట్ర నాయకత్వం ప్రకటించింది. బీజేపీ అగ్ర నేతల తెలంగాణా టూర్లు తరచూ రద్దవుతుండటం ఆ పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ ఏ మాత్రం పుంజుకోవడం లేదనీ, ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు లేవని అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతల మీద అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో నడ్డా, అమిత్షా రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఈటల రాజేందర్, అర్వింద్, వివేక్, రాజాసింగ్, తదితర ముఖ్యనేతల మధ్య, పాతా-కొత్త నాయకుల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో తమ మాటే చెల్లాలనే నాయకుల తీరుతో బీజేపీలో చేరాలనుకున్న నాయకులు కూడా వెనకడుగు వేస్తున్నారు. రాజాసింగ్ అయితే బీజేపీ ఆఫీసు వైపే కన్నెత్తిచూడటం లేదు. ఎమ్మెల్సీ కవితపై ఒంటికాలిపై లేచే ఎంపీ ధర్మపురి అరవింద్...ఆమెపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్ని బహిరంగంగా తప్పుబట్టడం సంచలనంగా మారింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆట్..ఊట్ అంటూ గొప్పలకు పోతున్నా రాష్ట్రంలో 80కిపైగా నియోజకవర్గాల్లో బీజేపీకి సరైన అభ్యర్థులే లేరన్నది పచ్చినిజం. మిగతా నియోజకవర్గాల్లోనూ పాత, కొత్త నాయకుల మధ్య పొసగక అంతర్గత పోరు తీవ్రమవుతున్నది. హైదరాబాద్లో పట్టున్న ఏడెనిమిది నియోజకవర్గాల్లో ఎవరికివారే తామే ఎమ్మెల్యే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో ఆధిపత్యపోరు మొదలైంది. పరిస్థితి ఇలాగే ఉంటే గతంలో మాదిరిగా పట్టుమని పదిసీట్లు కూడా రాబోవని బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం హెచ్చరిస్తున్నా...ఇక్కడి నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడేందుకు ఇతర పార్టీల నుండి వచ్చే చేరికల మీదే ఎక్కువగా ఆధారపడిందన్నది బహిరంగ రహస్యం. కానీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు బీజేపీ వైపు చూడకపోవడంతో బీజేపీ శ్రేణులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తున్న మాటలకు, క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితికి పొంతన లేదని గ్రహించడం వల్లనే కేంద్ర నాయకత్వం రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటంలేదు. రాష్ట్ర నాయకుల ఒత్తిడి మేరకు ఒకే అన్నా..చివరి క్షణాల్లో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు.