Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం తెచ్చేదాకా మోడీ సర్కారును వదలం
- కేరళ వామపక్ష ప్రభుత్వం దేశానికి ప్రత్యామ్నాయమే
- నవతెలంగాణతో ఏఐకేఎస్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
- ఏప్రిల్ 5న మజ్దూర్ కిసాన్ సంఘర్ష్
- ర్యాలీని విజయవంతం చేస్తాం
'మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన రైతాంగ పోరాటం మోడీ సర్కారు గుండెల్లో భయాన్ని పుట్టించింది. వాటిని అనివార్యంగా వెనక్కి తీసుకునేలా చేసింది. ఉత్పత్తి వ్యయంతో కలిసి 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర ఇచ్చేలా చట్టం చేస్తామని చెప్పి మాట తప్పింది. ఆ చట్టాన్ని చేసేదాకా మోడీ సర్కారును వదలబోం. రైతులకు రుణమాఫీ చేయాల్సిందే. కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కూలీలు దొరికేలా చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నది. మోడీ సర్కారు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేం దుకు సేవ్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్నాం. కేరళలోని వామపక్ష ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ముమ్మాటికీ దేశానికి ప్రత్యామ్నా యమే. అక్కడికెళ్లి చూస్తే వాస్తవాలేంటో తెలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీని విజయ వంతం చేస్తాం. ఆ ర్యాలీలో కార్మి కులు, రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొ నాలని పిలుపునిస్తున్నాం' అని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) అఖిల భారత ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ చెప్పారు. ఏప్రిల్ ఐదో తేదీన ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్, కిసాన్ సంఘర్ష్ ర్యాలీ నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి అచ్చిన ప్రశాంత్‌కు ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
మూడు వ్యవసాయక నల్లచట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా పోరాటం కొనసాగుతున్నదని చెబుతున్నరు. దేని కోసం మీ పోరాటం?
ఢిల్లీ రైతాంగ పోరాటాన్ని అణచడానికి ఎన్ని చేయాలో అన్ని చేసినా రైతులు తలొగ్గకుండా పోరాటం చేశారు. చివరకు మోడీ సర్కారు క్షమాపణ చెప్పి మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నది. 750 మందికిపైగా రైతులు చనిపోయారు. అది శత్రువుల హృద యంలో భయం పుట్టించిన పోరాటం. రైతుల విజయం. ఎమ్ఎస్. స్వామినాధన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామన్న మోడీ సర్కారు దాన్ని విస్మరించింది. రైతులకు ఉత్పత్తి వ్యయంతో కలిపి 50 శాతం అదనంగా ఇచ్చేలా కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టంగా పార్లమెంట్లో చేయాలని కోరాం. అది తెస్తే లీగల్‌గా మద్దతు ధర కోసం కొట్లాడే అవకాశం ఉంటుంది. అందుకోసమే మేం ప్రధాన డిమాండ్‌గా పెట్టాం. మోడీ సర్కారు చేస్తామని మాటిచ్చింది. కానీ, చేయటల్లేదు. మొక్కుబడిగా తన అనుకూల రైతు సంఘాలు, ప్రభుత్వ అనుకూల కార్పొరేట్ ప్రతినిధులతో కమిటీ వేశారు. సంయుక్త కిసాన్ మోర్చాగా దీన్ని ఖండించాం. అందులో మేం చేరలేదు. లఖింపూర్ ఖేరీలో ఐదు మంది రైతులు, ఒక జర్నలిస్టు మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కొడుకుపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఆ కేంద్ర మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించాలనే డిమాండ్‌ను మోడీ సర్కారు విస్మరించింది. ఏడాదికిపైగా కాలంలో రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలనే అంశాన్నీ పెడచెవిన పెట్టింది. విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరాం. దాన్నీ పట్టించుకోవట్లేదు. ఈ నేపథ్యంలోనే రైతుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. రెండో దశ ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నాం.
నూతన విద్యుత్ చట్టం తీసుకొస్తే దేశానికే ప్రయోజనమని బీజేపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఇది ఎంత వరకు వాస్తవం?
బీజేపీ ప్రచారం పూర్తి అవాస్తవం. వాస్తవానికి ఇది రైతు, ప్రజా వ్యతిరేక నిర్ణయం. మోటార్లకు మీటర్లు పెట్టాలని ఇప్పటికే చాలా రాష్ట్రాలపై మోడీ సర్కారు ఒత్తిడి పెంచుతున్నది. ఉచిత విద్యుత్, సబ్సిడీపై విద్యుత్ పొందుతున్న అన్నదాతలకు ఇది పూర్తిగా నష్టదాయకం. ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇప్పటికే ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల ధర నిర్ణయంపై ప్రభుత్వ నియంత్రణ పూర్తిగా పోయింది. ఎరువుల సబ్సిడీ ఎత్తివేత, విత్తనాలు, పురుగుమందుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ చట్టం అమలైతే అన్నదాతలకు గడ్డుకాలమే. ఇప్పటిదాకా పేదల ఇండ్లకు కరెంటుపై ఇస్తున్న సబ్సిడీ తొలగిపోతుంది. ప్రయివేటు సంస్థలు నిర్ణయించినట్టు చార్జీలు కట్టాలి. పీక్ అవర్స్‌లో కరెంటు వినియోగంపై అదనపు చార్జీలు మోపుతారంట. ఎంత దుర్మార్గం? దేశ ప్రజలకు నష్టం చేకూర్చే నిర్ణయం ప్రయోజనం ఎలా అవుతుంది? భారతీయ కిసాన్ సంఫ్‌ు(బీజేపీ అనుబంధ సంఘం) కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నది.
పంటలకు మద్దతు ధరల్లేక ఆయా రాష్ట్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆ పోరాటాలను ఎలా ముందుకు తీసుకుపోతారు?
పత్తిపంటకు రూ.10 వేల కనీస మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ పెట్టాం. కానీ, తెలంగాణలో రూ.6,400-6,500కి మించి దక్కటం లేదు. ఇప్పుడు సీసీఐని నిర్వీర్యం చేసే ప్రయత్నానికి కేంద్రం పూనుకున్నది. పత్తికే కాదు రబ్బరు, సుగంధద్రవ్యాలు తదితర బోర్డులకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కోతలు పెడుతూ పోతున్నది. ఆయా బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది. మహారాష్ట్రలో ఉల్లిగడ్డ, కాశ్మీర్లో యాపిల్, బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఆలుగడ్డ పంటలకు రేట్లు లేవు. అదే మార్కెట్లో నాలుగు రెట్లు అధిక ధరలున్నాయి. మహారాష్ట్రలో ఉల్లిగడ్డ రైతుల పోరాటం కొంతమేర విజయం సాధించింది. ప్రభుత్వం దిగొచ్చింది. అన్ని రాష్ట్రాల్లో పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. ఎక్కడిక్కడ స్థానిక డిమాండ్లను తీసుకుని జాతీయ స్థాయిలో పోరాటాన్ని రూపొందించేలా ఏఐకేఎస్ ముందుకెళ్తున్నది. రైతులకు ఉత్పత్తి వ్యయం+50 శాతం మద్దతు ధర, రైతు రుణమాఫీ కోసం ఐక్యపోరాటాలు చేయబోతున్నాం.
మోడీ సర్కారుకు భిన్నంగా రైతుల మేలు కోసం కేరళలో వామపక్ష ప్రభుత్వం ఏం చేస్తున్నది?
కేంద్ర ప్రభుత్వం క్వింటా వరి ధాన్యానికి మద్దతు ధరగా రూ. 2,040 నిర్ణయించింది. కానీ, వాస్తవానికి ఆ ధర రైతులకు ఎక్కడా లభించడం లేదు. యూపీ, బీహార్, తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో రూ.800 నుంచి రూ.1200 లోపే దక్కుతున్నది. కేంద్ర ప్రభుత్వం, మిగతా రాష్ట్రాలకంటే భిన్నంగా కేరళలో తమ ప్రభుత్వం క్వింటా వరి ధాన్యానికి రూ.2,870 చెల్లిస్తున్నది. 16 కూరగాయల పంటలకు కనీస ధరను ప్రభుత్వమే నిర్ణయించింది. వ్యాపారులు అంతకంటే తక్కువ కొనటానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు గ్రామ పంచాయతీలు కూడా హెక్టార్ వరి పంటకు రూ.25 వేలు, హెక్టార్ అరటి పంటకు రూ.30 వేల సబ్సిడీ ఇస్తున్నాయి. రబ్బరు, కొబ్బరి రైతులకు కూడా ప్రత్యేక సబ్సిడీలిస్తున్నారు. రైతుల మేలు కోరే ప్రభుత్వమంటే ఇది. మోడీ సర్కారుకు, కేరళ ప్రభుత్వానికి ఉన్న తేడా ఇదే. మేం చెబుతున్న ప్రత్యామ్నాయం ఇదే.
ఏప్రిల్ ఐదో ఏదీన ఢిల్లీలో తలపెట్టిన మజ్దూర్, కిసాన్ ఐక్యతా ర్యాలీ ప్రధాన ఉద్దేశమేంటి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి?
బీజేపీ అభివృద్ధి నినాదం ఒట్టిదేనని తేలిపోయింది. కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి ప్రమాదం పొంచి ఉంది. రాజ్యాంగంపై దాడి తీవ్రమైంది. ఆహార రంగం భవిష్యత్‌లో కీలకంగా మారబోతున్న నేపథ్యంలో మన వ్యవసాయాన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టే ప్రయత్నాలను మోడీ సర్కారు వేగతరం చేసింది. కార్మికులను కట్టుబానిసలుగా మార్చాలని చూస్తున్నది. ఈ చర్యలు దేశానికే ప్రమాదకరం. ఈ నేపథ్యంలోనే సేవ్ ఇండియా నినాదంతో ముందుకెళ్తున్నాం. రాజ్యాంగం, ఫెడరలిజం, సెక్యూలరిజాలను కాపాడుకు నేందుకు ఏఐకేఎస్గా ఉద్యమబాట పడుతున్నాం. మజ్దూర్, కిసాన్ ఐక్యతా ర్యాలీని విజయవంతం కాకుండా చూడాలని మోడీ సర్కారు విఫలయత్నాలు చేస్తున్నది. పార్లమెంట్ స్ట్రీట్‌లో ర్యాలీ చేపట్టడానికి అనుమతి నిరాకరించింది. ధర్మశాల కమ్యూనిటీ హాల్ బుక్ చేస్తే క్యాన్సల్ చేయించింది. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఢిల్లీకి రాకుండా ఆపేందుకు రైళ్లలో జనరల్ బోగీలను తగ్గించింది. రాంలీలా మైదానంలో అనుమతిచ్చినా అనేక ఆంక్షలున్నాయి. అయినా, ముందుకెళ్తున్నాం. సంఘర్ష్ ర్యాలీ విజయవంతం కోసం మేధావులు, రచయితలు, ఆయా సంఘాల నేతలతో రిసెప్షన్ కమిటీ వేశాం. దానికి చైర్మెన్‌గా ప్రభాత్ పట్నాయక్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఐదు లక్షల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులతో ర్యాలీని విజయవంతం చేస్తాం. మలిదశ రైతాంగ ఉద్యమానికి ఈ ర్యాలీ వేదిక కాబోతున్నది.