Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కమిషనర్‌కు సీఐటీయూ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
శ్రమశక్తి అవార్డుకు కార్మిక శాఖ పంపిన నామినేషన్ ప్రతిపాదనల్ని తిరస్కరిస్తున్నట్టు కార్మిక శాఖకు సీఐటీయూ స్పష్టం చేసింది. శుక్రవారం ఈ మేరకు లేబర్ కమిషనర్‌కు లేఖ అందజేసినట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ తెలిపారు. కార్మిక సమస్యలపై పనిచేస్తున్న వారికి మేడే సందర్భంగా శ్రమ శక్తి అవార్డులివ్వడానికి ప్రభుత్వం నిర్ణయించిందనీ, సీఐటీయూ నుంచి కూడా అవార్డుకు ప్రతిపాదనలు పంపాలని కార్మిక శాఖ కోరిందని తెలిపారు. దీన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. 73 రంగాల్లో కనీస వేతనాల జీవోలను వేతన సవరణ చేయకపోవడాన్నీ, 2021లో ఐదు రంగాలకు ఫైనల్ నోటిఫికేషన్స్ గెజిట్ చేయలేదని గుర్తుచేశారు. కాంట్రాక్టు కార్మికుల కోసం ఇచ్చే జీవో 11 కూడా సవరించలేదని ప్రస్తావించారు. కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాలు నిర్ణయించేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. అత్యంత దుర్భర జీవితాలు గడిపే లక్షలాది బీడీ మహిళలకు ఉపయోగపడే 41ని ప్రభుత్వం అబెయన్స్‌లో పెడితే దాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర సర్కారు సిద్ధంగా లేదని చెప్పారు. రాష్ట్రంలో యూనియన్ల రిజిస్ట్రేషన్లు సకాలంలో చేయడం లేదన్నారు. కొన్ని కంపెనీల్లో యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా కార్మిక హక్కులు హరిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు రూల్స్ ఫైనల్ కాకపోయినా అందులోని కార్మిక వ్యతిరేక అంశాలను యాజమాన్యాలు అమలు చేస్తుంటే కార్మిక శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని విమర్శించారు.
పరిశ్రమల్లో రక్షణ చర్యల గురించి పట్టించుకోవడం లేదని చెప్పారు. వలస కార్మికులను యాజమాన్యాలు తీవ్రంగా దోపిడీ చేస్తున్నాయనీ, అధిక పని గంటలు, భద్రత లేని ప్రమాదభరితమైన పనులు చేయిస్తున్నారని తెలిపారు. 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం అమలుకు చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను చట్ట ప్రకారం పర్మినెంట్ చేయడం లేదనీ, పెరుగుతున్న ధరలకనుగుణంగా వారి వేతనాలు నిర్ణయించడం లేదని చెప్పారు.
కాంట్రాక్ట్, క్యాజువల్, డైలీవేజ్ తదితర పద్ధతుల్లో పని చేస్తున్న కార్మికులకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ, ఇతర సామాజిక భద్రత చర్యలు కల్పించడం లేదన్నారు. ఇటువంటి అనేక కార్మిక వ్యతిరేక, యాజమాన్యాల అనుకూల విధానాలు అవలంభించే కార్మిక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ శ్రమ శక్తి అవార్డును సీఐటీయూగా తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. కార్మికుల శ్రమను ప్రభుత్వం, యాజమాన్యాలు కొల్లగొడుతున్న తరుణంలో ప్రభుత్వమిచ్చే ''శ్రమశక్తి'' అవార్డుకు అర్ధం లేదని భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరియు కార్మిక శాఖ పైన పేర్కొన్న సమస్యలపై దృష్టి సారించాలని కోరారు.