Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాశిగామ గ్రామస్తుల రాస్తారోకో
- పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన
- లాఠీచార్జిలో పలువురికి గాయాలు
నవతెలంగాణ-వెల్గటూర్
ఇథనాల్ పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామస్తులు కరీంనగర్-రాయపట్నం రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. పరిశ్రమను రద్దు చేయకుంటే ఆత్మహత్య చేసుంటామంటూ.. పురుగుల మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలిపారు. ఇథనాల్ పరిశ్రమ పెట్టి తమ ప్రాణంతీయొద్దని మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మద్దతు తెలిపి రాస్తారోకో పాల్గొన్నారు. గ్రామసభ పెట్టకుండా, గ్రామస్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఫ్యాక్టరీని ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లితుందన్నారు. వెంటనే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ప్రజలు అనుమతిస్తేనే ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తుండగా మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో లాఠీచార్జి చేయడంలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. అడ్లురి లక్ష్మణ్‌కుమార్‌ను సారంగాపూర్ స్టేషన్‌కు తరలించారు.