Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరైన రాష్ట్ర గవర్నర్ తమిళి సై
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలో శుక్రవారం శ్రీరామ పుష్కర పట్టాభిషేకం కనుల పండువగా జరిగింది. వేకువ జామునే ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు.. ముందుగా సుప్రభాత సేవ నిర్వహించి, ఆరాధన అరగింపు జరిపారు. అనంతరం రాముని పాదుకులకు అభిషేకం జరిపారు. రాజ లాంఛనాలతో గోదావరి నదీ తీరం నుంచి తీర్థములు తీసుకొచ్చారు. భక్తుల కోలాటాలు, భాజా భజంత్రీల సందడి నడుమ స్వామివారిని ఊరేగింపుగా విధుల ప్రాంగణంకు తీసుకొచ్చారు. అక్కడ కల్యాణ మండపంపై స్వామివారికి విశ్వక్సేన ఆరాధన గావించారు. అనంతరం పుణ్యాహవాచనం జరిపారు. పాదుకలు, రాజదండం, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, ఖడ్గం, రత్నాభరణాలు స్వామివారికి ధరింప చేశారు. శ్రీరామ పట్టాభిషేక పారాయణం గావించారు. శుక్ల, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, భగవత్ శాస్త్రం తదితర పారాయణం చేశారు. పుష్కర నది జలాలతో మహా కుంభ తీర్థప్రోక్షణ జరిపి మంగళహారతి ఇచ్చారు. పట్టాభిషేకం అనంతరం భక్తులపై అర్చకులు పుణ్య నది జలాలను చల్లారు. శ్రీరామ పుష్కర పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ గౌతమ్ పోట్రు, ఎస్పీ డాక్టర్ వినీత్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.