Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకే ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినయ్‌కుమార్
- వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణ ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చట్టాలెన్ని ఉన్నా ఆడపిల్లలపై లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు నిత్యకృత్యమవుతున్నాయని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ కార్యదర్శి ఎస్ వినరుకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కరాటే శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. ట్రస్టు చైర్మెన్ బుగ్గవీటి సరళ అధ్యక్షతన జరిగిన సభలో వినరు కుమార్ మాట్లాడుతూ లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఎన్ని చట్టాలు చేసినా, షీ టీములు ఏర్పాటు చేసినా.. అలాంటి ఘటనలు తగ్గటం లేదని చెప్పారు. దీనికి మనువాద పురుషాధిక్యతా భావజాలమే కారణమని తెలిపారు. మరో పక్క పెట్టుబడి దారి సమాజం ఆడపిల్లని అంగడి సరుకుగా చూపించడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే వీరనారి ఐలమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆడపిల్లల ఆత్మరక్షణకోసం ''కరాటే' లాంటి ''మార్షల్ ఆర్ట్స్'' నిర్వహిస్తున్నామని తెలిపారు. మల్లు స్వరాజ్యం, మోటూరి ఉదయం వర్థంతి సందర్భంగా దీన్ని ప్రారంభించటం సముచితంగా ఉందన్నారు. ఇలాంటి కేంద్రాలను వీలైనంత ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి. జ్యోతి మాట్లాడుతూ మోటూరి ఉదయం, మల్లు స్వరాజ్యం వర్ధంతి సందర్భంగా 'కరాటే శిక్షణా శిబిరం' ప్రారంభించటమంటే వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవటమేనని చెప్పారు. మహిళలు ధైర్యంగా బ్రతకాలనీ, అన్ని రంగాల్లో ముందుండాలంటూ వారు కోరేవారని గుర్తుచేశారు. కుటుంబాన్ని కాపాడుకున్నట్టుగానే సమాజాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత మహిళలపైనే ఉందని భావించేవారని పేర్కొన్నారు. ట్రస్టు కార్యదర్శి బి. హైమవతి మాట్లాడుతూ తమ ట్రస్టు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు నడుస్తున్నాయని చెప్పారు. బాధిత మహిళలకి ఆశ్రయం ఇవ్వటం కోసమే ట్రస్టు భవన్లో 'షార్ట్ స్టే హోమ్'ను ప్రారంభించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఆడపిల్లలు తమని తాము కాపాడుకోవటానికి ''ఉచిత కరాటే శిబిరాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. మహిళలు పని చేస్తే తప్ప కుటుంబాలు గడవని నేపథ్యంలో ఆడపిల్లల విద్యపై తల్లుల కేంద్రీకరణ తగ్గుతుందన్నారు. భవిష్యత్తులో వారి కోసం ట్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో ట్రస్టు కోశాధికారి కె.ఎన్ ఆశాలత, ఐద్వా అధ్యక్షులు ఆర్. అరుణ జ్యోతి, ట్రస్టు సభ్యులు డి.ఇందిర, విశాలక్ష్మి, ఉదయలక్ష్మి, శశికళ, లక్ష్మమ్మ, గాయత్రి తదితరులు పాల్గొన్నారు.