Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్‌కు రేవంత్ ప్రశ్న
- ఈడీ విచారణ జరపాలని డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మంత్రి కేటీఆర్‌కు పేపర్ లీకు డేటా ఎలా వచ్చిందో చెప్పాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ అంశంపై ఈడీ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ కేసులో నిందితులకు, కేటీఆర్‌కు సంబంధమేంటని ప్రశ్నించారు. అసలు కేటీఆర్‌కు ముందుగానే ఎగ్జామ్ డేట్ ఎలా తెలిసిందన్నారు. అధికారులు ఇవ్వలేదంటున్నారు...మరి దొంగలు ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. ఆ దొంగలకు కేటీఆర్‌కు సంబంధమేంటని నిలదీశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో పేపర్ లీక్ కేసు వ్యవహారంపై రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ బందం ఈడీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అనంతరం రేవంత్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ కమిషన్ వెల్లడించుకుండా, పబ్లిక్ డోమైన్లో లేకుండా కటాఫ్ మార్కులు విషయం కేటీఆర్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. 415 మంది జగిత్యాల నుంచి గ్రూప్ వన్ పరీక్ష రాశారంటూ కేటీఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పేపర్ లీకుపై విచారణను మంత్రి నియంత్రిస్తున్నారని ఆరోపించారు. మంత్రి చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని విమర్శించారు. దీనిపై విచారణ జరపాలని ఈడీని కోరామన్నారు. కేటీఆర్‌కు నిజంగా పరువుంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటూ లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు చనిపోతున్నా కల్వకుంట్ల కుటుంబానికి చీమకుట్టినట్టుగా లేదని రేవంత్ అన్నారు. ఆధారాలు బయట పెడితే తిరిగి మాపైన్నే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకర్ లక్ష్మి నుంచి నేరం మొదలైతే ఆమెను సాక్షిగా పెట్టడమేంటని ప్రశ్నించారు. పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర లక్ష్మిని, ఏ2గా చైర్మెన్, సెక్రటరీలను చేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇరుకున పడ్డప్పుడల్లా సిట్‌ను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో కావల్సిన వారిని కాపాడి దిగువ స్థాయి ఉద్యోగులను బలి పశువులు చేస్తున్నారన్నారు. ఈ కేసులో కోట్ల రూపాయల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయనీ, ఇందులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారాయని ఆరోపించారు. సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తోందని తెలిపారు. అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు బయటపెట్టిన ప్రతిపక్షాలకు సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు. ఆందోళన చేస్తే అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. పేపర్ లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.