Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హర్షం వ్యక్తం చేసిన బోర్డు
- పలు కీలక నిర్ణయాలకు డైరెక్టర్ల ఆమోదం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సమర్పించిన ఆర్థిక నివేదికపై కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎలాంటి అభ్యంతరాలు తెలుపకుండా (నిల్ కామెంట్స్) ఆమోదించడంపై ఆ సంస్థ పాలకమండలి (బోర్డు) హర్షం వ్యక్తం చేసింది. సింగరేణి ఆదాయ వ్యయాలపై ఆర్థిక విభాగం ఎంతో పకడ్బందీగా, సమర్థవంతంగా సంస్థ తరఫున సమర్పిస్తున్న ఆర్థిక నివేదికలకు గత నాలుగేండ్లుగా కాగ్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఆడిట్‌కు పూర్తి స్థాయి ఆమోదం తెలపడం పట్ల పాలకమండలి సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) కి అభినందనలు తెలిపింది.హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం సంస్థ సీఎమ్‌డీ ఎన్ శ్రీధర్ అధ్యక్షతన 566వ బోర్డు సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డైరెక్టర్లు, సింగరేణి డైరెక్టర్లు దీనిలో పాల్గొన్నారు. పలు ప్రతిపాదనలపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకున్నారు. సింగరేణి సంస్థ ఒడిస్సా రాష్ట్రంలో చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ నుండి ఈ ఏడాది బొగ్గు ఉత్పత్తి అవుతున్న నేపథ్యంలో అక్కడికి సమీపంలోని హండపా రైల్వే సైడింగ్ వరకు బొగ్గు రవాణా చేసి, రైల్వే వ్యాగన్లలోనికి లోడ్ చేసే పనులకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదం తెలిపింది. ఈ వివరాలను సంస్థ సీఎమ్‌డీ ఎన్. శ్రీధర్ వెల్లడించారు. నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఏడాదికి సుమారు కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందనీ, బొగ్గు బ్లాక్ నుంచి సమీపంలోని రైల్వే స్టేషన్‌కు కొత్త రైలుమార్గం నిర్మాణం జరుగు తుందని తెలిపారు. అప్పటివరకు రోడ్డు మార్గం ద్వారా మరో రెండేండ్ల పాటు బొగ్గు రవాణా చేయ డం కోసం కాంట్రాక్టు ఏర్పాటుకు ప్రతిపాదించగా బోర్డు అనుమతించింది. వీటితోపాటు రామగుండం ఓసి-2 విస్తరణ ప్రాజెక్టు, కోయగూడెం రెండు ఓపెన్ కాస్టుకు సంబంధించి ఓవర్ బర్డెన్ తొలగింపు వంటి పనులకు ఆమోదం లభించింది. పలు ఏరియాల్లో భారీ యంత్రాలకు అవసరమైన స్పేర్ పార్ట్‌ల కొనుగోలుకు, 70 డంపర్లకు అవసరమైన సేవలకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపింది. ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3 ఏరియాల్లో కార్మికుల తాగునీటి సౌకర్యం కోసం రూ. 20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్స్ నిర్మాణానికి అవసరమైన నిధులను బోర్డు మంజూరు చేసింది. దీంతో రోజుకు 35 మిలియన్ లీటర్ల గోదావరి నీటిని శుద్ధి చేసి పంపిణీ చేయనున్నారు. మైనింగ్ విద్యకు ప్రోత్సాహంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో కోర్సుల పునరుద్ధరణకు సింగరేణి సంస్థ రూ. 3 కోట్ల విరాళం అందించడానికి బోర్డు అంగీకరించింది. సమావేశంలో బోర్డు సభ్యులు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మ, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సోలంకి, డైరెక్టర్ శ్రీమతి సంతోషి, డబ్ల్యుసిఎల్ సీఎండి మనోజ్ కుమార్, సింగరేణి సంస్థ నుండి డైరెక్టర్ ఫైనాన్స్ , ఎన్. బలరామ్, డైరెక్టర్లు డి. సత్యనారాయణరావు, ఎన్.వి.కె. శ్రీని వాస్, జి. వెంకటేశ్వర్ రెడ్డి, కంపెనీ సెక్రటరీ శ్రీమతి సునీతా దేవి, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం. సురేష్ పాల్గొన్నారు.