Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్రం ఏకపక్ష నిర్ణయం: సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్
- ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి టోల్ పన్ను పెంచే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. రహదారులపై టోల్ రేట్ నిర్ణయించే ముందు నోటీసు ఇచ్చి ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని, అవేమీ చేయకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం చేయడం సరికాదన్నారు. శుక్రవారం ఏఐఆర్‌టీడబ్లూఎఫ్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ఆటో కార్మికులు, శివం రోడ్, గోల్నాక డీసీఎం అడ్డా, షాపూర్ నగర్ డీసీఎం అడ్డా దగ్గర తదితర ప్రాంతాల్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాల శ్రీకాంత్ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రకాల వాహనాలు టోల్ ప్లాజా ద్వారా వెళ్తూ టోల్ పన్ను చెల్లిస్తున్నాయని, వాస్తవంగా రహదారుల అభివృద్ధి సెస్ పేరుతో ప్రతి లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.2, అదనంగా వసూలు చేస్తున్నారని . 2017-18 నుంచి మోడీ ప్రభుత్వం దీనిని రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్‌గా మార్చేసి.. ఈ మొత్తాన్ని రోడ్డు నిర్మాణానికి, నిర్వహణకు ఉపయోగించాలని చెప్పిందన్నారు. కానీ పెట్రోలియం ప్రణాళిక, విశ్లేషణ శాఖ లెక్కల ప్రకారం(పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ) 2021-22 ఆర్థిక సంవత్సరంలో 3,084,9000 మెట్రిక్ టన్నుల పెట్రోలు, 7,66,59,000 మెట్రిక్ టన్నుల డీజిల్ అమ్ముడుపోయిందని, దానిపై ప్రభుత్వం రోడ్డు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ కింద రూ.2,70,000 కోట్లు వసూలు చేసిందన్నారు. ఇదే ఆర్థిక సంవత్సరంలోనే సుమారు వెయ్యి టోల్ ప్లాజాల ద్వారా 34,778 కోట్ల రూపాయలను వసూలు చేసిందని చెప్పారు. మౌలిక వసతుల అభివృద్ధి సెస్ వసూలు చేసిన తర్వాత టోల్ పన్ను వసూలు చేయడం ఏవిధంగా న్యాయమవుతుందని కేంద్రాన్ని ప్రశ్నించారు. వసూలు చేసిన పన్ను ఎంత, ఖర్చు ఎంత అనే విషయాల్లో పారదర్శకత లేదన్నారు. టోల్ చార్జీలను ప్రతియేటా పెంచుతూనే ఉందని, నేటి నుంచి టోల్ చార్జీలను పెంచుతున్నట్టు ఎన్హెచ్ఏఐ ప్రకటించిందని, ఈ పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజరుబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన టోల్ పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రంలో ఈ నిర్ణయం ద్వారా కార్మికులు, ప్రజలపై భారం పడకుండా తెలంగాణ సర్కారు ప్రత్యామ్నాయ మార్గాలను వెతకాలని సూచించారు. సీఐటీయూ సికింద్రాబాద్ జోన్ కన్వీనర్ టి.మహేందర్ మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ కార్మికులపై కేంద్రం అనేక పేర్లతో భారాలు వేస్తూ.. వారి ఆదాయాలు కొల్లగొడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలక టోల్ పన్ను పెంచడం దుర్మార్గమన్నారు. ట్రాన్స్‌పోర్టు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సికింద్రాబాద్ జోన్ నాయకులు కైలాష్, శేఖర్, శ్యామ్, వెంకటేష్, ఫిరోజ్, సీఐటీయూ అంబర్‌పేట జోన్ కన్వీనర్ జి.రాములు, నగర నాయకులు డీఎల్ మోహన్, ట్రాన్స్పోర్ట్ రంగం నాయకులు రఘు నాయక్ తదితరులు పాల్గొన్నారు.