Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ సభ్యుల విచారణకు కసరత్తు
- బోర్డు సభ్యుల స్టేట్మెంట్ రికార్డు చేయనున్న అధికారులు
- విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు!
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పలుపు తిరిగింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల ప్రక్రియ ఎలా చేపట్టారన్న దానిపై సిట్ అధికారులు దృష్టి సారించారు. ఉద్యోగ నియామక పరీక్షల్లో సభ్యుల సలహాలు, సూచనలు ఎంతమేరకు ఉంటాయి, ప్రశ్నాపత్రాల భద్రత, కమిషన్ సభ్యులు తీసుకునే చర్యలపై ఆరా తీయనున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ సెక్రెటరీతోపాటు బోర్డు సభ్యులను విచారించాలని ఓ నిర్ణయానికొచ్చిన సిట్ అధికారులు.. హాజరు కావాలంటూ టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యులు బండి లింగారెడ్డి, సైలు చింత, రమావత్ ధాన్‌సింగ్, కోట్ల అరుణ కుమారి, సుమిత్రా ఆనంద్, కె.రవీందర్‌రెడ్డి, ఏ.చంద్రశేఖర్‌రావుకు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. అలాగే, చైర్మెన్ బి.జనార్ధన్‌రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించి 8 మంది బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఇప్పటికే పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 16మందిపై కేసులు నమోదు చేసిన సిట్ మొత్తం 6 రకాల పరీక్షలకు చెందిన 15 ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్టు గుర్తించింది. గ్రూప్1 పేపర్ ఐదుగురికి చేరగా, ఏఈ పేపర్ ఎక్కువ మందికి లీక్ అయిందని సిట్ గుర్తించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లో గ్రూప్1, ఏఈ, ఏఈఈ, టౌన్ ప్లానింగ్, జేఎల్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్లు లభ్యమయ్యాయి. ఈ పేపర్లను అమ్మేందుకు యత్నిస్తున్న క్రమంలోనే స్కాం బయటపడింది. ఈ క్రమంలో సురేష్, రమేష్, షమీమ్‌ను సిట్ ఐదు రోజులపాటు కస్టడీకి తీసుకుంది. మూడో రోజు కస్టడీలో వారి నుంచి మరిన్ని విషయాలు రాబట్టిన సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ సభ్యులను విచారించాలన్న నిర్ణయానికొచ్చారు. ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కావడంతో మరికొంతమందికి ఈ వ్యవహారంతో సంబంధాలుండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.