Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలివ్వాలి : సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అసెంబ్లీలో ప్రభుత్వమిచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్వీసును క్రమబద్ధీకరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో గత 20 ఏండ్లకు పైగా విద్యా, వైద్య రంగాలతోపాటు, వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులు పనిచేస్తున్నారని తెలిపారు. వారి సర్వీసును క్రమబద్ధీకరించేందుకు 2016లో జీవో నెంబర్ 16ను ప్రభుత్వం జారీ చేసిందని గుర్తు చేశారు. న్యాయస్థానాల తాత్కాలిక ఉత్తర్వుతో క్రమబద్దీకరణ ప్రక్రియను నిలిపివేశారని పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో సుప్రీంకోర్టు సానుకూలమైన తీర్పు ఇచ్చిందని తెలిపారు. గతేడాది మార్చి తొమ్మిదో తేదీన రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఆరో తేదీన కూడా అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను క్రమబద్ధీకరణ చేయనున్నట్టు ప్రకటించారని గుర్తు చేశారు. కానీ వాటికి సంబంధించిన ఉత్తుర్వులు ప్రభుత్వం నుంచి నేటికీ జారీ కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల క్రమబద్దీకరణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసేందుకు అవసరమైన ఆదేశాలివ్వాలని కోరారు.