Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాజమాన్యానికి నోటీసు ఇచ్చిన యూనియన్లు
- 17 ఉదయం 8 గంటల నుంచి సమ్మెలోకి...
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో సమ్మె సైరన్ మోగింది. వేతన సవరణతో పాటు ఇతర సమస్యల పరిష్కారంలో యాజమాన్యం, ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి నిరసనగా తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చింది. టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు కార్యాలయంతో పాటు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) ఇన్వార్డ్ సెక్షన్లో జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈనెల 17వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తం 24 విద్యుత్ ఉద్యోగ సంఘాల నేతృత్వంలోని జేఏసీ ఈ నోటీసులు ఇచ్చింది. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులకు నూతన వేతన సవరణ (పీఆర్సీ) అమల్లోకి రావల్సి ఉందనీ, ఏడాది పూర్తయినా, ఇప్పటికీ దానిపై పూర్తి స్పష్టత ఇవ్వలేదని జేఏసీ చైర్మెన్ సాయిబాబు, కన్వీనర్ పీ రత్నాకరరావు, జాయింగ్ సెక్రటరీ వీ గోవర్థన్ తెలిపారు. అలాగే ఆర్జిజన్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కన్వర్షన్ చేయాలనీ, 1999 నుంచి 2002 వరకు ఉద్యోగాల్లో చేరిన వారికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పెన్షన్, జీపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలనే పలు డిమాండ్లను యాజమాన్యం ఎదుట ఉంచినట్టు తెలిపారు. పలుదఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తప్పనిసరై సమ్మెలోకి వెళ్లాల్సి వస్తున్నదని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం, యాజమాన్యం తమ సమస్యల పరిష్కారంపై చొరవ చూపాలనీ, సమ్మెతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా నివారించాలని విజ్ఞప్తి చేశారు. సమ్మె నోటీసులను ఇంథనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మకు, కార్మిక శాఖ కమిషనర్‌కు కూడా అందచేశారు.