Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనదారులపై పన్నుపోటు
- రాష్ట్ర పరిధిలోని జాతీయ రహదారులపై 32 టోల్గేట్లు
- లక్షలాది వాహనాల రాకపోకలు
- ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలు
- ఆర్టీసీ బస్ చార్జీలపై ప్రభావం
- నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరల భాదుడు
టోల్ చార్జీల బాదుడుకు ట్రాన్స్పోర్ట్ రంగం కుదేలవుతోంది. రాష్ట్ర పరిధిలోని వివిధ మార్గాల్లో జాతీయ రహదారులపై 32 టోల్గేట్లు ఉన్నాయి. వాటిపై ప్రస్తుతం టోల్‌ట్యాక్స్ రూ.1800 కోట్లకుపైగా వసూలు అవుతోంది. గడిచిన తొమ్మిదేండ్లలో కేంద్రం టోల్‌చార్జీలను భారీగా పెంచుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు రోడ్డెక్కాలంటే జంకుతున్నారు. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు మండిపోతున్నాయి. తాజాగా టోల్ చార్జీలు పెంచడంతో రవాణా సరుకుల ధరలు పెరిగే ప్రమాదముంది. సామాన్యులపై భారాలు.. సంపన్నులకు వరాలిస్తున్న మోడీ తొమ్మిదేండ్ల పాలనలో ధరల మోత మోగిస్తున్నారు. జనం విలవిల్లాడుతున్నారు. టోల్ చార్జీల పెంపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు జాతీయ రహదారులున్నాయి. నిత్యం 55వేల వివిధ రకాల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, లారీలు, డీసీఎంలు, ట్రక్కులు, ట్యాంకర్లు, కార్లు, జీపులు, మినీ బస్సులు, తేలికపాటి వాహనాలతో పాటు భారీ నిర్మాణ యంత్రాలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం టోల్ చార్జీలు పెంచడంతో వాహనాలపై పన్ను భారం పడనుంది. హైదరాబాద్ నుంచి పటాన్చెరు, సంగారెడ్డి, జహీరాబాద్ మండలంలోని బైరాన్‌పల్లి మీదుగా ముంబయి-విశాఖపట్నం 65వ జాతీయ రహదారి వెళ్తుంది. ఈ రహదారిపై సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలంలోని కంకోల్ వద్ద డెక్కన్ టోల్‌ప్లాజా ఉంది. అదే విధంగా మెదక్ జిల్లా మీదుగా కశ్మీర్-కన్యాకుమారి వరకు వెళ్లే జాతీయ రహదారి 44 దేశంలోనే అతిపెద్ద నేషనల్ హైవే. తూఫ్రాన్ వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మరో జాతీయ రహదారి కంది-నాందేడ్ వరకు 161వ హైవే ఉంది. ఈ రహదారిపై చౌటకూరు మండలంలోని తాడ్దాన్పల్లి వద్ద టోల్ ప్లాజా ఏర్పాటు చేశారు.
పన్ను పోటు
భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఎఐ) ప్రతి ఏటా టోల్ చార్జీలను 5 నుంచి 10 శాతం వరకు పెంచుతోంది. ఈ ఏడాది కూడా టోల్ చార్జీలను భారీగా పెంచి 2023-24కిగాను ఏప్రిల్ 1 నుంచే అమలు చేస్తోంది. ప్రతి 70 కిలో మీటర్ల వరకు సవరించిన కొత్త టోల్ ధరలు భారీగా పెరిగాయి. గతేడాది 8 నుంచి 15 శాతం వరకు టోల్ చార్జీలు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాది ఈ నెల ఒకటో తేదీ నుంచి 5 నుంచి 10 శాతం వరకు చార్జీలను పెంచింది. కారు, జీపు, వ్యాన్ తేలికపాటి వాహనాలు ఫాస్టాగ్ ద్వారా ఒకవైపు ప్రయాణానికి రూ.110 చెల్లించాలి. తిరుగు ప్రయాణానికి అంటే చెల్లించిన సమయం నుంచి 24 గంటల లోపు వరకు రూ.165 చెల్లించాలి. తేలికపాటి వాణిజ్య వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, మినీ బస్సులు అయితే ఒకవైపు ప్రయాణానికి రూ.180 చెల్లించాలి. బస్, ట్రక్ (రెండు ఇరుసుల వాహనాలకు రూ.410, భారీ నిర్మాణ యంత్రవాహనాలకు, బహుళ ఇరుసుల అంటే నాలుగు నుంచి ఆరు ఇరుసుల వరకు వాహనాలకు రూ.715 చెల్లించాల్సి ఉంటుంది. ఒకవైపు వెళ్లడానికి మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి. అది కూడా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే. నగదు రూపంలో చెల్లించాల్సి వస్తే అదనపు చార్జీలు పడతాయి.
ఇతర ధరల పెరుగుదల
టోల్ చార్జీలను పెంచడం వల్ల ఇతర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇప్పటికే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వాహనాలకు ధరల భారాలు మోయలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీలో బస్ చార్జీలు పెంచారు. తాజాగా టోల్ ధరలు పెరిగినందున ప్రయాణిలకులపైనే ఆ భారం వేయనున్నారు. అదే విధంగా లారీ, ట్రక్కులు, జీపులు, కార్లు, బస్సులు, ఇతర భారీ వాహనాలకు పెట్రోల్, డీజిల్ ధరలు భారంగా మారాయి. రోజువారీగా వచ్చే కిరాయిల కంటే ఆయిల్ ధరలే ఎక్కువవుతున్నాయని స్వంత వాహనదారులు అమ్మేసుకుంటున్నారు. మినీ వాహనాలపై ఈ భారాల ప్రభావం అధికంగా ఉంది. తాజాగా టోల్ ఛార్జీలు పెరిగినందున ప్రతి సరుకుల ధరల్లోనూ పెరుగుల తప్పదని వ్యాపారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిత్యవసరాల ధరలు మరింత పెరుగుతాయంటున్నారు. తేలికపాటి వాహనాల ద్వారా నిత్యవసర సరుకులు, కూరగాయలు, పాలు, ఇతర సరుకుల్ని రవాణా చేస్తున్నారు. వీటిపైన డీజిల్, టోల్ ధరల భారం పెరగడంతో చాలా మంది ఈఎంఐలు కట్టలేకపోతున్నారు.
వాహనాలు నడపలేకపోతున్నం
చిలకపల్లి లక్ష్మణ్- మునిపల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు బాగా పెంచుతోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు నాలుగింతలు చేసిండ్రు. నిత్యావసరాల ధరలు ఆకాశానంటాయి. వాహనాల్ని రోడ్డెక్కించాలంటే భయమేస్తుంది. ఇట్ల వెళ్లి వద్దామంటే టోల్ చార్జీలు పిండేస్తున్నారు. ప్రతి ఏటా టోల్ చార్జీలు పెరుగుతున్నయి. వాహనాల కిరాయిలు, ఆదాయం మాత్రం పెరగట్లేదు. అప్పులు చేసి వాహనాలు కొనుక్కున్న యజమానులు ఎలా బతికేది. డీజిల్ ధరలు, టోల్ చార్జీలు భరించలేక వాహనాల్ని అమ్మేసుకోవాల్సి వస్తోంది. టోల్ చార్జీలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నం. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు.