Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వం సిద్ధం చేసిన అధికారులు
- హాజరు కానున్న 4,94,620 మంది విద్యార్థులు
- 2,652 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
- హాల్‌టికెట్ చూపితే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 13వ తేదీ వరకు అవి కొనసాగనున్నాయి. ఈ పరీక్షలను ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షల నిర్వహణ కోసం పాఠశాల విద్యాశాఖ అధికారులు సర్వంసిద్ధం చేశారు. విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లాల కలెక్టర్లు, డీఈవోలతో విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పలుసార్లు వీడియో కాన్ఫరెన్స్,సమీక్ష సమావేశాలను నిర్వహించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం 2,652 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు.ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులున్నారు.ఈ విద్యాసంవత్స రం నుంచి పదో తరగతి పరీక్షలు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతోనే నిర్వహిస్తున్నారు. ఇందు కు సంబంధించి గతంలోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకూ విద్యాశాఖ అధికారులు హాల్‌టికెట్లను పంపించారు. ఇంకోవైపు www.bse.telangana.gov.in వెబ్సైట్లో కూడా వాటిని అందుబాటులో ఉంచారు. పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించారు. పరీక్షా సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ వంటి పనులను ఇప్పటికే పూర్తి చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను ఇచ్చారు. ప్రస్తుతం ఎండల తీవ్రత నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలతోపాటు విద్యార్థులకు అవసరమైన సదుపా యాలు,తాగునీరు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లతోపాటు పరీక్షలు జరిగే అన్ని రోజుల్లో ఒక ఏఎన్ఎంను కేటాయించేలా ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవడానికి వీలుగా టీఎస్ఆర్టీసీ ఆ సమయానికి ఎక్కువ సంఖ్యలో బస్సులను నడిపేందుకు సిద్ధమైంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్‌ను చూపించి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పరీక్షా కాలంలో నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టనుంది.