Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మెరుపు ధర్నా
- ఇందిరాపార్క్ వద్ద ఒంటరిగా బైఠాయింపు, నిరసన
- సీఎం హామీమేరకు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్
- అరెస్టు చేసిన పోలీసులు
- పలు సంఘాల ఖండన
ఏ పోరాటమైనా ఒక్కడితోనే ప్రారంభమవుతుందంటారు. కానీ ఇక్కడ ఒక్కడే అందరి తరఫున నిలబడ్డాడు. సమస్యకు మూలం వెతికి ఒక్కడిగానే నిరసనకు దిగాడు. మందీ మార్బలం లేదు. పోరాట స్ఫూర్తి మాత్రమే ఉంది. సమస్యను సర్కారు దృష్టికి తీసుకెళ్లాలనే తపనా ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయట్లేదంటూ ఒంటరిగా రోడ్డెక్కారు. ప్లకార్డు ప్రదర్శిస్తూ, ఒక్కడే గొంతెత్తి నినాదాలు చేస్తూ నడిరోడ్డుపై కూర్చుండిపోయాడు. ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. ట్రాఫిక్ నిలిచింది. వాహనదారులు ఏం జరిగింది అని ఆరా తీయడం కనిపించింది. పోలీసుల్లో కదలిక మొదలైంది. ఏమైందంటూ ట్రాఫిక్‌ను తోసుకుంటూ ముందుకొచ్చారు. తెల్లటి ప్యాంటు, షర్టు వేసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి నల్లటి డాంబర్ రోడ్డుపై ఒంటరిగా కూర్చుని నినాదాలు చేస్తున్నారు. పోలీసులకు విషయం అర్థమయ్యేసరికి అర్థగంట దాటింది. ఈలోపు అక్కడంతా హడావిడి. సహజంగా ధర్నాలు, నిరసనలు అంటే కనీసం 20, 30 మంది అయినా జమై, నినాదాలు చేస్తుంటారు. కానీ ఇక్కడ నర్సిరెడ్డి ఒక్కరే నడిరోడ్డుపై కూర్చుని నిరసనకు దిగారు. దీనికి ఇందిరాపార్కు రోడ్డు వేదికైంది. పోలీసులు వచ్చి ఆయన్ని బతిమిలాడారు. అక్కడి నుంచి వెళ్లాలని ఆదేశించారు. 'తగ్గేదేలే' అంటూ నర్సిరెడ్డి తన పాటికి తాను నినాదాలు చేస్తూనే ఉన్నారు. జనం ఒక్కసారిగా ఆయన్ని చూడటానికి ముందుకొచ్చారు. నిరసన తీవ్రమవుతుందని గ్రహించిన పోలీసులు బలవంతంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డిని జీపులో ఎక్కించుకొని వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మెరుపు ధర్నాకు దిగారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శనివారం ఉదయం 11 ఒక్కడే వచ్చి అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను, వివిధ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అందుకనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను జారీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న 11,103 మంది కాంట్రాక్టు ఉద్యోగులను ఈనెల ఒకటో తేదీ నుంచి క్రమబద్ధీకరిస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, 2023-24 బడ్జెట్ ప్రసంగంలోనూ రాత పూర్వకంగా హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇది కొత్త హామీ కాదని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం 2016లోనే జీవోనెంబర్ 16ను విడుదల చేశారని వివరించారు. అది హైకోర్టులో కొంతకాలం పెండింగ్‌లో పడింద న్నారు. ఆ తర్వాత క్రమబద్ధీకరణ చేయొచ్చని కోర్టు తీర్పునిచ్చిందని చెప్పారు. ఇప్పుడు కోర్టుతోపాటు ఎలాంటి ఆటంకాల్లేవని అన్నా రు. కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకుల సర్టిఫికెట్లను కూడా పరిశీలించారని వివరించా రు. దీనికి సంబంధించి అన్ని రకాల సమాచా రం సీఎం కేసీఆర్‌కు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పంపించారని చెప్పారు. క్రమబద్ధీకరణకు సంబంధించి సీఎం ఆదేశాలిస్తే వెంటనే ఉత్తర్వులు జారీ చేసే అవకాశముందని అన్నారు. కానీ కేసీఆర్ తాత్సారం చేయడం పట్ల 11,103 మంది ఆవేదనతో ఉన్నారని చెప్పారు. వారి ఆవేదనను అర్థం చేసుకుని వెంటనే ఉత్తర్వులు జారీ అయ్యేలా అధికారులను ఆదేశించాలని సీఎంను కోరారు. ఒక్కడే అయినా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసనకు దిగిన తీరును ప్రసంశించారు. ఈ విషయం సోషల్ మీడియా లో విస్తృతంగా ప్రచారమైంది. ఉపాధ్యాయులు, అధ్యాపకుల పక్షాన పోరాడే ఒకే ఒక్కడు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అంటూ కామెంట్లు పెడుతూ ఆయనకు మద్దతుగా నిలిచారు. చివరకు ధర్నాకు అనుమతి లేదనే కారణంతో మధ్యాహ్నం నర్సిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీన్ని పలు సంఘాలు ఖండించాయి.
టీఎస్‌యూటీఎఫ్ సంఘీభావం
నర్సిరెడ్డి చేపట్టిన దీక్ష వద్దకెళ్లి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, తెలంగాణ వాయిస్ ఆఫ్ టీచర్ ప్రధాన సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ ఆంజనేయులు సంఘీభావం ప్రకటించారు. నర్సిరెడ్డి అరెస్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీలు ఖండించాయి. వెంటనే క్రమబద్ధీకరణ ఉత్తర్వులను విడుదల చేయాలని కోరుతూ టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475 అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.