Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ పనితీరుపై ప్రశ్నలు?
- కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని విచారించిన సిట్
నవతెలంగాణ-సిటీబ్యూరో
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు చర్చనీయాంశంగా మారింది. విచారణలో రోజుకో లింకులు బయటకు రావడం మరింత ఆసక్తిగా మారింది. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్, కమిషన్ సభ్యులు లింగారెడ్డిని సిట్ అధికారులు శనివారం వేర్వేరుగా విచారించారు. టీఎస్పీఎస్సీ పనితీరుతోపాటు ఉద్యోగాల నియామకాలు, పేపర్ లికేజీ, ప్రవీణ్‌కు సంబంధించిన వివిధ అంశాలపై సిట్ అధికారులు ఇద్దరినీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ కేసులో విచారణకు రావాలంటూ టీఎస్పీఎస్సీ సభ్యులకు సైతం సిట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వారిని అధికారులు ప్రశ్నించి స్టేట్మెంట్లను రికార్డు చేసినట్టు తెలిసింది. ఇప్పటికే లింగారెడ్డి పీఏ రమేష్‌ను సిట్ విచారించిన విషయం తెలిసిందే.
టీఎస్పీఎస్సీ కార్యాలయంలోనే సెక్రటరీ ఆధీనంలోనే కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం నడుస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం ఇలా అన్ని పనులూ సెక్రటరీ ఆధీనంలోనే జరుగుతాయి. లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ అనితా రామచంద్రన్ వద్ద పీఏగా పనిచేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అందులో 103 మార్కులు వచ్చాయి. అదేలా సాధ్యమని అనుమానించిన సిట్ అధికారులు ప్రవీణ్‌కు సంబంధించిన వివరాలపై అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించినట్టు తెలిసింది. పరీక్ష నిర్వహణపై కూడా సిట్ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటి వరకు 15మందిని అరెస్టు చేసిన అధికారులు పలువురిని విచారించిన విషయం తెలిసిందే. దర్యాప్తు అంతా ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, ఎవరెవరికి వెళ్లాయి, ఎంత మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయి అనే కోణంలో విచారణ కొనసాగింది. అయితే తాజాగా టీఎస్పీఎస్సీ సభ్యులను సైతం విచారిస్తుండటంతో చర్చనీయాంశంగా మారింది.