Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు పోస్టుకార్డు ఉద్యమం
- 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష
- 10 నుంచి పాదయాత్ర
- గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసనసభ
- కులికుతుబ్‌షా మైదానంలో 7న ఇఫ్తార్ విందు
- టీఎస్పీఎస్సీని రద్దు చేయాల్సిందే : రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడాలని టీపీసీసీ నిర్ణయించింది. రాహుల్‌గాంధీ అనర్హత వేటుకు నిరసనగా సోమవారం పోస్టుకార్డు ఉద్యమం చేయాలని తీర్మానించింది. ఈనెల 8న మంచిర్యాలలో ఆపార్టీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనుంది. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, నాయకులు బోసురాజు, జి. చిన్నారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్లురవి, సిరిసిల్ల రాజయ్య, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డితో కలిసి రేవంత్ విలేకర్లతో మాట్లాడారు. రంజాస్ పండుగను పురస్కరించుకుని టీపీసీసీ ఆధ్వర్యంలో కులికుతుబ్ షా మైదానంలో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్టు తెలిపారు. 10 నుంచి 25 వరకు తిరిగి పాదయాత్ర కొనసాగించనున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో నిరుద్యోగ నిరసన సభను నిర్వహిస్తామన్నారు. 2014లో రూ. 20వేల కోట్లు ఉన్న అదానీ ఆదాయం 2023 జనవరి 15 నాటికి రూ. 13 లక్షల కోట్లకు ఎగబాకిందన్నారు. మోడీ, అమిత్‌షా సహకారంతోనే అదానీ ప్రజాధనాన్ని లూఠీ చేశారని విమర్శించారు. అదానీలకు మోడీ ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారంటూ రాహుల్ ప్రశ్నించినందుకే ఆయన్ను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆరోపించారు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పలేకే ఆయనపై బీజేపీ కుట్రలను పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ ఉన్న ఇంటిని కూడా ఖాళీ చేయించి ఆయనపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధిస్తున్నదని చెప్పారు. నడిబజారులో నిలబెట్టి పైశాచిక ఆనందం పొందేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకుపై ఈడీ కేసు నమోదు చేసిందన్నారు. తద్వారా తమ పోరాటం ఫలించిందని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తక్షణమే టీఎస్పీఎస్సీని రద్దు చేసి, కొత్త నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీపై విచారణ ఎదుర్కొంటున్న లింగారెడ్డి బావమరిది రాజశేఖర్ రెడ్డి సీఎంవోలో పని చేస్తున్నారని చెప్పారు. వైఎస్ షర్మిలతో కలిసి రాజకీయంగా ముందుకెళ్లొద్దంటూ తమ కమిటీ సూచించిందని వివరించారు. బీజేపీ నేతలు పేపర్ పులుల్లా టీవీల ముందు రంకెలు వేయొద్దని హెచ్చరించారు. పేపర్ లీక్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజరు, అమిత్ షాకు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఈ అంశంపై గవర్నర్‌కు కిషన్‌రెడ్డి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గద్దర్ గళం వినిపిస్తారని వివరించారు.
ఆయన్ను మించినోడు లేడు
సీఎం కేసీఆర్‌పై రేవంత్ ట్వీట్
'ఒకటైతే నిజం...పచ్చి అబద్ధాన్ని కూడా ఇదే నిజం అనిపించేలా సీఎం కేసీఆర్ చెప్పడంలో ఆయన్ను మించినోడు' లేడంటూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో రైతులు ఉరికొయ్యలకు వేలాడుతున్న లెక్కలు ఎన్సీఆర్బీ రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని తెలిపారు. లెక్కకు రానివి ఇంతకు పదింతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు లేవన్న నీ మాటల్లో నిజమెంతో నిగ్గుతేల్చుదాం... రావాలని సవాల్ విసిరారు.