Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ జిల్లాలో ఘటన
నవతెలంగాణ-పూడూర్
పాఠశాలలో విద్యుద్ఘాతంతో ఓ విద్యార్థిని ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని మంచన్‌పల్లి గ్రామంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం..
మంచన్‌పల్లి గ్రామానికి చెందిన మంగలి నరసింహులు-లక్ష్మీ కూతురు మంగలి దీక్షిత(9) గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. అక్కడ మూత్రశాలకు వెళ్లి వస్తుండగా విద్యుత్ తీగ తగిలింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే దీక్షితను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందింది. విద్యుత్ యర్త్ కోసం స్తంభం నుంచి వైర్‌ను మూత్రశాలల పక్కన పెట్టారు. ఆ తీగ తగలడం వల్లే విద్యుద్ఘాతానికి గురై విద్యార్థిని మృతిచెందింది. విద్యుత్ అధికారులు, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన జరిగిందని గ్రామస్తులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.