Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐటీయూసీ ధర్నా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఏండ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న యూరోపియన్ కమిషన్ (ఈసీ) ఏఎన్ఎంల సేవలను క్రమబద్ధీకరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నానుద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్ మాట్లాడుతూ ఈసీ ఏఎన్ఎంలు 2002లో డీయస్సీ రాత పరీక్షలు రాసి మెరిట్ ప్రకారం, రూల్ ఆఫ్ రిజర్వేషన్లో, రోస్టర్ విధానాన్ని పాటిస్తూ ఎంపికయ్యారని గుర్తుచేశారు. అలా ఎంపికైన వారంతా రెగ్యులర్ అయి నెలకు రూ.ఒక లక్ష జీతం తీసుకుంటుండంగా, ఈసీ ఏఎన్ఎంలను మాత్రం కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణిస్తూ నెలకు రూ.27,000 మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం.నరసింహ మాట్లాడుతూ ఇదే పని చేస్తున్న పురుష వర్కర్లకు రూ.41,000 జీతం ఇస్తూ మహిళలు రూ.27,000తో సరిపెట్టడం వివక్ష చూపించడమేనని విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 16లో ఈసీఏఎన్ఎంలను చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు తోట రామాంజనేయులు, ఈసీ ఏఎన్ఎంలు టి మంజుల, ఎం విజయలక్ష్మి, హసీనా, జి.అనిత, ఆర్. రాజ్యలక్ష్మి, పి నవీన, ఏ.సుమతి, జి. అనిత, టి.అమృత, బి. జోష్ణ, ఎస్. సులోచన, ధనలక్ష్మీ, ఆర్.రూప, ఏ.లలిత, ప్రియదర్శిని, భారతి, శ్రీమతి, వసంతా, సంపూర్ణ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.