Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై ప్రచారం
- పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
- కూల్‌రూఫ్ పాలసీని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో 'మన నగరం' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. అన్ని పురపాలక సంఘాల్లోనూ ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఆయా పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, భవిష్యత్ ప్రణాళికలపై చర్చ, ప్రచారం నిర్వహించడం ప్రధాన ఉద్దేశ్యమని వివరించారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పురపాలకశాఖ పరిపాలనా కమిషనర్ అండ్ డైరెక్టర్ (సీడీఎంఏ) ప్రధాన కార్యాలయంలో తెలంగాణ కూల్‌రూఫ్ పాలసీ 2023-28ని ఆయన ఆవిష్కరించారు. ఇండ్లపై కూల్‌రూఫ్ ఏర్పాటుతో అధిక వేడిని నియంత్రించుకోవచ్చని చెప్పారు. ఇకపై 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు కూల్ రూఫ్ తప్పనిసరి అనీ, అప్పుడే నిరంభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్ఓసీ) ఇస్తామని తెలిపారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే ఈ పాలసీని తీసుకొస్తున్నామన్నారు. టీఎస్ బీపాస్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా భవన నిర్మాణ అనుమతులు ఇస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో వంద చదరపు కిలోమీటర్ల మేరకు కూల్ రూఫ్ అమలుచేస్తామని చెప్పారు. ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లకూ దీన్ని అమలు చేస్తామన్నారు. 2030 నాటికి రాష్ట్రంలో 200 చదరపు కిలోమీటర్ల కూల్ రూఫ్‌టాప్ ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కూల్‌రూఫ్ వల్ల మీటరుకు రూ.300 మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. ఇప్పటికే కట్టిన భవనాలపై కూడా కూల్‌రూఫ్ విధానం అమలుచేయొచ్చనీ, దీన్ని ప్రోత్సహించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను ప్రకటించాలని ఆయన అధికారులను ఆదేశించారు. విద్యుత్ వాహనాల వినియోగం పెరగాలన్నారు. భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా పునరుత్పత్తి చేసేలా హైదరాబాద్‌లో రెండు ప్లాంట్లు ఏర్పాటుచేశామనీ, వీటిని మరింత అభివృద్ధి చేసి కూల్రూఫ్కు ఉపయోగపడేలా ప్రత్యేక టైల్స్ ఉత్పత్తి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని కోరారు. దీనికోసం రియల్టర్ల వద్ద పనిచేసే సిబ్బంది, ఇతరులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కూల్‌రూఫ్ విధానంలో ఇండ్లపై నిర్మించే పై కప్పు వల్ల గది ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయనీ, పైకప్పులకు ఉపయోగించే సామగ్రిలో కొన్ని మార్పులు చేయడం, ప్రత్యేక రసాయనాల వినియోగంతో 5 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత తగ్గుతుందని అంచనా వేశామన్నారు. కూల్‌రూఫ్ విధానంలో సూర్యకిరణాలు తిరిగి వాతావరణంలోకే పరావర్తనం చెందడం ద్వారా ఇంటి లోపలకు వేడి రావడం తగ్గుతుందనీ, దీనికోసం శ్లాబ్‌పైన కూల్ పెయింట్ వేయడం, వినైల్ షీట్లు పరచడం, టైల్స్ వేసుకోవడం, భవనాల పైన మొక్కలు పెంచడం, సౌర విద్యుత్తు ఫలకాల ఏర్పాటు వంటి చర్యలతో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వివరించారు. కార్యక్రమంలో సీడీఎమ్ఏ సత్యనారాయణ, పురపాలకశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.