Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీపీఏ, ఏపీకి కేంద్ర జలసంఘం ఆదేశాలు
- సంయుక్త సర్వే నిర్వహణా నిర్లక్ష్యంపై గరంగరం
- తెలంగాణ ఒత్తిడితో అధ్యయనానికి నియమిత కాలపరిమితి విధింపు
- పోలవరం ప్రాజెక్టు అథారిటీకి స్పష్టమైన ఆదేశాలు
- ఏప్రిల్ 10న ఏపీ, తెలంగాణతో భేటీ
- అనంతరం చేపట్టాలని దిశానిర్దేశం
- గోపాలకృష్ణ కమిటీని ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పిన ఒడిషా, చత్తీస్‌గఢ్
- కొత్తగా అధ్యయనం చేసి సర్వే, ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టాలని పట్టు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
పోలవరం ప్రాజెక్టు ముంపుపై తక్షణమే సర్వే చేపట్టాలని ప్రాజెక్టు అథారిటీకి, ఏపీ సర్కారుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం పట్టువదలకుండా చేస్తున్న ఒత్తిడి నేపథ్యంలో ముంపుపై అధ్యయనం కోసం నియమిత కాలపరిమితిని విధించింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపుతోపాటు, ఇతర అనేక సాంకేతిక అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తెలంగాణ, ఏపీ, ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలతో ఏకాభిప్రాయం సాధించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే సీడబ్ల్యుసీ రెండుసార్లు అన్ని రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. అలాగే మరోసారి ఢిల్లీలో సోమవారం మూడో భేటీని ఏర్పాటు చేసింది. ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను, అభ్యంతరాలపై మరోసారి చర్చించింది. కేంద్ర జల సంఘం చైర్మన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు ముంపు సమస్యలు, ఇతర సాంకేతిక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ మరోసారి తన వాదనలను బలంగా వినిపించింది.
తెలంగాణ వాదనలు..
1. పోలవరం ప్రాజెక్టు ముంపుపై సర్వే నిర్వహణను ఏపీ తాత్సారం చేస్తుండడాన్ని తెలంగాణ తీవ్రంగా నిరసించింది. సీడబ్ల్యూసీ గతంలో ఆదేశాలు జారీ చేసినా ఏపీ అసంబద్ధ వాదనలతో సర్వేకు ముందుకు రాకపోవడాన్ని తప్పుబట్టింది.
2. పోలవరం ఎఫ్ఆర్ఎల్ లెవల్లో నీటిని నిల్వ చేసినప్పుడు తెలంగాణ భూభాగంలో ఏర్పడుతున్న ముంపును గుర్తించాలి. అదేవిధంగా డ్రైనేజీ, స్థానిక ప్రవాహాలు నిలచిపోవడం వల్ల వాటిల్లే ప్రభావాలపై, జూలై 2022 వరదలపై తాజాగా ఉమ్మడి అధ్యయనం చేపట్టాలి.
3. ముఖ్యంగా మణుగూరు భార జల కేంద్రం, చారిత్రక భద్రాచలం, ఆలయం రక్షణకు చర్యలు చేపట్టాలి. కొత్తగా ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. భ్రదాచలం పట్టణంలో ఎనిమిది అవుట్ ఫాల్ రెగ్యులేటర్ల స్థాయిని ధృవీకరించాలి.
4. పోలవరం ప్రాజెక్టు కారణంగా కిన్నెరసాని, ముర్రేడువాగు నదుల నీటి పారుదల రద్దీకి సంబంధించి ఎన్జీటీ ఉత్తర్వులను అనుసరించి ఆ రెండు వాగులతో పాటూ ఆరు నుంచి ఏడు ఇతర పెద్ద స్థానిక ప్రవాహాలపై కూడా సర్వే చేయాలి.
5. రాబోయే వర్షాకాలం దృష్ట్యా జాయింట్ సర్వేపై మరింత సమయం కోల్పోకుండా సత్వరమే చర్యలు ప్రారంభించాలి.
6. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో చేసిన విధంగా ఏదైనా ఏజెన్సీతో పీపీఏ ఆధ్వర్యంలో సంయుక్త సర్వేను తక్షణమే చేపట్టాలి.
7. పూడిక ప్రభావంతో సహా నది క్రాస్-సెక్షన్లను కొత్తగా తీసుకుని జాయింట్ సర్వే చేసి ముంపును అంచనా వేయాలి.
8. పోలవరం ప్రాజెక్ట్ కారణంగా తెలంగాణలో వచ్చే జూలై 2022 వరదల ప్రభావాన్ని సీడబ్ల్యూసీ అంగీకరించడం లేదు. కానీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్ ఆపరేషన్ షెడ్యూల్ నిబంధనలకు కట్టుబడి ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆ ప్రభావం ఉండదని చెబుతున్నది. అయితే పోలవరం బ్యాక్ వాటర్ వల్ల వరద ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో జాయింట్ సర్వే తర్వాత పూణేలోని సీడబ్యూసీ, పీఆర్ఎస్, ఇతర నిపుణులతో వీలైనంత త్వరగా సంబంధిత మోడల్ అధ్యయనాలను చేయించాలి.
9. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధంగా రాష్ట్రాల సమస్యలను, ఆందోళనను పరిష్కరించాలంటే పైన పేర్కొన్న చర్యలన్నీ చాలా అవసరం.
10. అప్పటివరకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడం కానీ, జలాశయాన్ని నిర్వహించడం కానీ ఎట్టిపరిస్థితుల్లో చేపట్టకూడదు.
సత్వరమే సర్వేను చేపట్టాలి
జాయింట్ సర్వే అంశంపై భేటీలో తెలంగాణ ప్రధానంగా పట్టుబట్టింది. పోలవరం బ్యాక్ వాటర్స్ ఎఫెక్ట్‌పై ఉమ్మడి సర్వే చేపట్టాలని తెలంగాణ డిమాండ్‌ను జనవరి 25న నిర్వహించిన రెండవ సాంకేతిక సమావేశాల్లోనే సీడబ్లూసీ అంగీకరించింది. ఆ నిర్ణయాలను మినిట్స్‌లో నమోదు కూడా చేసింది. ఏపీని సమన్వయం చేసుకుంటూ సంయుక్త సర్వే చేపట్టాలని పీపీఏకు అప్పుడే ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంపై ప్రస్తుత సమావేశంలో తెలంగాణ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దీంతో సీడబ్లూసీ వెంటనే స్పందించింది.
ఉమ్మడి సర్వేకు పూర్తికి నియమిత కాలపరిమితిని విధిస్తూ పీపీఏకు అల్టీమేటం జారీ చేసింది. అందులో భాగంగా తొలుత ఏప్రిల్ 10వ తేదీన తెలంగాణ, ఏపీతో సమావేశం నిర్వహించాలని పీపీఏను ఆదేశించింది. ముంపుపై ఇరు రాష్ట్రాలు గతంలో చేసిన అధ్యయనాలపై, రూపొందించిన మ్యాపులపై చర్చించాలని దిశానిర్దేశం చేసింది. తదననంతరం ఉమ్మడి సర్వేను సత్వరమే చేపట్టాలని నొక్కి చెప్పింది. ఇదిలావుండగా సమావేశానికి హాజరైన ఒడిషా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు సైతం పలు డిమాండ్లను సీడబ్ల్యూసీకి నివేదించాయి. ముంపునకు సంబంధించి గోపాలకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించేది లేదనీ, కొత్తగా అధ్యయనం చేసి సర్వే, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. సీడబ్ల్యూసీ చైర్మెన్ కుష్విందర్ వోరా అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ నాగేంద్రరావు, చీఫ్ ఇంజినీర్ కొత్తగూడెం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, తెలంగాణ ఇంటర్‌స్టేట్ బోర్డు గోదావరి డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి, పోలవరం చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌బాబు, ఒడిషా రాష్ట్రం నుంచి ఈఎన్సీ అశుతోష్‌దాస్, ఛత్తీస్‌గఢ్ చీఫ్ ఇంజినీర్ నగరియాతోపాటు కేంద్ర జల సంఘం, పోలవరం అథారిటీ అధికారులు పాల్గొన్నారు.