Authorization
Sun April 27, 2025 05:31:46 am
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వాకపల్లి ఆదివాసీ మహిళలపై 2007లో జరిగిన లైంగిక దాడి ఘటనపై నేర పరిశోధన స్వతంత్ర దర్యాప్తు సంస్థతో హైకోర్టు పర్యవేక్షణలో తిరిగి దర్యాప్తు చేయించాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ( ఓపీడీఆర్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి నర్సింహారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమపై గ్రేహౌండ్స్ పోలీసులు లైంగిక దాడి చేశారంటూ బాధిత మహిళలు పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. అయినా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలిపారు. ఈ సంఘటనపై వివిధ ప్రజాసంఘాలు, హక్కుల సంఘాలు రాజకీయ పార్టీలు ఆందోళన చేయటంతో 2007ఆగస్టు 20న పోలీసులు ఎఫ్ఐఆర్ 86/2007 గా సెక్షన్ 376, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారని తెలిపారు. కేసు ప్రారంభ దశలోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ హోంమ్ మంత్రి జానారెడ్డి, డీజీపీ వాకపల్లి ఘటనపై మాట్లాడుతూ ఆదివాసీ మహిళలపై పోలీసులు ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదనీ, ఇది మావోయిస్టుల ప్రేరేపిత అబద్ధపు కేసంటూ పేర్కొన్నారని గుర్తుచేశారు. అధికారులు ఉద్దేశపూర్వ కంగానే కేసు వీగిపోయే విధంగా వ్యవహరించారని తెలిపారు.అందువల్ల కోర్టు ఈ కేసును పున్ణ పరిశోధనకు అర్హ మైనదిగా భావించి తిరిగి దర్యాప్తునకు పంపించాలని కోరారు.