Authorization
Tue April 08, 2025 01:01:27 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు సీఐటీయూ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి విధులను ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, కారోబార్, బిల్ కలెక్టర్లకు అప్పగించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ సమ్మెకు ఇతర శాఖల్లోని ఉద్యోగులు సహకరించాలని కోరారు. మూడేండ్ల ప్రొబేషనరీ కాలం అని మొదట్లో చెప్పి దాన్ని నాలుగేండ్లకు పెంచారనీ, ఆ గడువు పూర్తయినా వారిని పర్మినెంట్ చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. మరణించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల స్థానంలో కారుణ్య నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు కల్పించాలని విన్నవించారు.
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ మద్దతు
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మెకు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ కూడా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.పాండు, సీహెచ్.వెంకటయ్య, ఉపాధ్యక్షులు పి.సుధాకర్ ఒక ప్రకటన విడుదల చేశారు. క్రమబద్ధీకరణ కోసం జరుగుతున్న సమ్మె న్యాయ సమ్మతమైనదని తెలిపారు.