Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్లో మార్పులుచేర్పులు ప్రగతిభవన్ నుంచే జరుగుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి ఆరోపించారు. ధరణిని తీసుకొచ్చింది రైతులు, ప్రజల కోసం కాదనీ, అది గులాబీ లీడర్ల కోసమని విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. రాత్రికి రాత్రే భూములను నిషేధిత జాబితాలో చేర్చుతున్నారనీ, పరిష్కారం పేరుతో మధ్యవర్తులు, దళారులు రంగంలోకి దిగుతున్నారని ఆరోపించారు. ఒకప్పుడు గ్రామస్థాయిలో పరిష్కారమయ్యే భూములను నేడు ప్రగతిభవన్ కేంద్రంగా సెటిల్మెంట్ చేస్తున్నారని ఆరోపించారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేశారు? అది రిపోర్టు ఇచ్చిందా? ఇస్తే ఏముంది? రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంది? వాటన్నింటికీ రాష్ట్ర సర్కారు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ధరణిపై ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? వాటిలో ఎన్ని పరిష్కారమయ్యాయి? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అనే విషయాలను చెప్పాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీ చేతుల్లో టీఆర్ఎస్ బందీ అయిందని విమర్శించారు. పాతబస్తీలో ప్రభుత్వ అధికారులు కూడా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి లేదని చెప్పారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సచివాలయానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారనీ, అసలు ఎమ్మెల్యేలనే లోపలికి వెళ్లనీయని సచివాలయం ఎందుకు అని నిలదీశారు. మధ్యప్రదేశ్ నుంచి పోలీసులు వచ్చి ఇక్కడి ఉగ్రవాదులను అరెస్టు చేస్తుంటే మన రాష్ట్రంలో వందల కోట్ల రూపాయలతో కట్టిన కమాండ్ కంట్రోల్ రూమ్ ఏం చేస్తున్నదని ప్రశ్నించారు.