Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో మంత్రి కేటీఆర్
- బ్రిడ్జ్ ఇండియా-ఈపీజీ కార్యక్రమానికి హాజరు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఐదు విప్లవాలను సాధించడంతోనే అనతికాలంలో తెలంగాణ ప్రగతి సాధ్యమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మోడల్‌ను అనుసరిస్తే ఇండియాకు తిరుగుండబోదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షిం చేందుకు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్, లండన్‌లో శనివారం నిర్వహించిన 'ఐడియాస్ ఫర్ ఇండియా' సదస్సులో పాల్గొని తొమ్మిదేండ్ల తెలం గాణ విజయగాథను ఉద్వేగభరితంగా వివరిం చారు. ఉపాధి కల్పన, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చేకునేలా యువతను తయారు చేసినప్పుడే దేశాభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు.
''భారతదేశానికి అనేక సహజ అనుకూలతలు ఉన్నాయి. దేశంలో సమృద్ధిగా సహజ వనరులు, ఖనిజాలతో పాటు తగినంత కరెంటును ఉత్పత్తి చేయడానికి అవసరమైన వనరులు ఉన్నాయి. దేశంలో ఉన్న నదులు, సరస్సులు, నీటి వనరులతో వ్యవసాయ భూములకు కావాల్సినంత సాగునీరు ఇవ్వడంతో పాటు ప్రజలందరికి తాగునీరు, పారిశ్రామిక రంగానికి అవసరమైన నీటిని సరఫరా చేయయొచ్చు. వీటన్నింటికన్నా ముఖ్యంగా సాటిలేని మానవ వనరులు మనదేశంలో ఉన్నాయి. మానవ జాతి చరిత్రలో ఇప్పటివరకు ఏ దేశానికి లభించని గొప్ప అవకాశం భారతదేశానికి మాత్రమే దొరికింది. దేశ జనాభాలో 67శాతం మంది పనిచేసే వయస్సువారే ఉన్నారు.
జనాభాలో అత్యధికంగా ఉన్న యువత శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే విధంగా సరైన ప్రణాళికలు, సమర్థవంతమైన కార్యచరణను అమలుచేస్తే 30 ఏండ్లల్లో చైనా సాధించిన ప్రగతిని 20 ఏండ్లలోపే ఇండియా సాధిం చొచ్చు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను సృష్టించేలా యువతకు శిక్షణ ఇవ్వాలి. ఉపాధి, వ్యవస్థాపకత రంగాల్లో అనేక అవకాశాలను వారికి అందించాలి. తొమ్మిదేండ్లల్లోనే విప్లవాత్మక ప్రగతితో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా మారింది. వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడం తోనే ఆయా రంగాల్లో విప్లవాత్మక మార్పును సాధించింది' అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో ఫేమస్ కొటేషన్ అయిన 'సమయం వచ్చిందనే ఆలోచన కంటే శక్తివంతం ఏదీ లేదు' అని ప్రస్తావించిన కేటీఆర్, తెలంగాణ మోడల్‌కు సమయం ఇప్పుడు వచ్చిందని వెల్లడించారు. తెలంగాణ మాదిరిగానే భారతదేశంలోని వ్యవస్థాగత సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
నూతనోత్సాహంతో కూడిన భవిష్యత్తును సృష్టిస్తూ, నాలుగో పారిశ్రామిక విప్లవంలో భారతదేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దుతూనే రైతు, యువతపై దృష్టి సారించాలని కోరారు. సరైన ప్రణాళిక, అంకితభావంతో పనిచేస్తే వచ్చే 20 ఏండ్ల్లల్లో భారతదేశం తలసరి ఆదాయాన్ని 6 నుంచి 8 రెట్లు పెంచొచ్చని, ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటిగా ఇండియా అవతరించే రోజు ఎంతో దూరంలో లేదని ధీమా వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో డీఏజెడ్ఎన్ స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కొనసాగుతున్న మంత్రి కేటీఆర్ ఇంగ్లాండ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతున్నది. స్పోర్ట్స్ లైవ్ స్ట్రీమింగ్‌లో దిగ్గజ సంస్థ అయిన డీఏజెడ్ఎన్ హైదరాబాద్‌లో తమ ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. లండన్‌లో ఉన్న కేటీఆర్‌ను డీఏజెడ్ఎన్ గ్రూప్ ఉన్నతాధికారులైన సందీప్ టికు, డైసీ వెల్స్‌లు కలిసిన తర్వాత కంపెనీ ఈ ప్రకటన చేసింది. 200కుపైగా దేశాల్లో 60 మిలియన్ల సబ్ స్క్రైబర్లు ఉన్న అంతర్జాతీయ ఓవర్-ది-టాప్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ సర్వీస్ (ఓటీటీ డీఏజెడ్ఎన్). ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు అత్యధికంగా చూసే యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, యూరోపా లీగ్, సీరీ ఏ, లా లీగా, ఇంగ్లీషు ప్రీమియర్ లీగ్, ఎన్ఎఫ్ఎల్, ఎన్బీఏ, ఇతర దేశాల్లోని ఐపీఎల్ వంటి ప్రధాన ఈవెంట్ల లైవ్, ఆన్-డిమాండ్ స్పోర్ట్స్ కంటెంట్‌ను డీఏజెడ్ఎన్ ప్రసారం చేస్తుంది.
ఈ పెట్టుబడితో తెలంగాణ యువతకు వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయని కంపెనీ తెలిపింది. ఇన్నోవేషన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న ఆధిపత్యానికి డీఏజెడ్ఎన్ పెట్టుబడే నిదర్శనమని తెలిపింది.