Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణితం, సైన్స్ ప్రశ్నాపత్రంలో లోపాలతోనే తగ్గిన టెన్త్ ఉత్తీర్ణత
- రాష్ట్రంలో 40వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి
- జూన్‌లోపే టీచర్ల బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలి : టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మతపరమైన భావజాలం వ్యాప్తికే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం-2023 తీసుకోస్తుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి అన్నారు. జాతీయ విద్యావిధానంపై 660 పేజీల డ్రాప్ట్‌ను రిలీజ్ చేసి అభిప్రాయాలు చెప్పాలని కోరినా అది మాతృభాషలో లేకపోవడం వల్ల చాలామంది తమ అభిప్రాయాలను వెల్లడించలేకపోయారని చెప్పారు. ఖమ్మం టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో చావా రవి విద్యారంగ సమస్యలపై మాట్లాడారు. దేశం మొత్తానికి ఒకే సిలబస్ ఉండాలనే పేరుతో భారతదేశ చరిత్ర నుంచి గాంధీజీ హత్య, గుజరాత్ అల్లర్ల వంటి అంశాలను తొలగించి మూఢ, మత విశ్వాసాలను పెంపొందించే సిలబస్‌ను రూపొందిస్తున్నారని తెలిపారు. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కూడా తొలగించటం దారుణమన్నారు.
ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దీనికోసం జులైలో పాదయాత్రలు, ఆగస్టు 12న నిరసనలు, నవంబర్‌లో మార్చ్ టూ పార్లమెంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా 86.6% ఉత్తీర్ణత సాధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ.. వందశాతం ఫలితాల కోసం ప్రభుత్వం ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి పెడుతోందన్నారు. అయితే, సైన్, గణితం ప్రశ్నాపత్రాల కూర్పులో లోపాల కారణంగానే రిజిల్ట్స్ ఒకింత తగ్గాయన్నారు. సగటు విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని రూపొందించాల్సిన గణితం పేపర్‌ను ఐఐటీ స్థాయిలో ప్రశ్నలిచ్చారని ఆరోపించారు. భౌతిక, రసాయన శాస్త్రాలతో పాటు జీవశాస్త్రాన్ని ఒకే పేపర్‌గా నిర్వహించడం వల్ల కూడా మార్కులపై ప్రభావం పడిందన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే ప్రశ్నాపత్రాలు తయారు చేయించాలని కోరారు.
వేసవి సెలవుల్లోనే ప్రమోషన్లు ఇచ్చి, బదిలీలు చేపట్టడం ద్వారా ఖాళీల సంఖ్య తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో 20వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నట్టు చెప్పారు. ఇంగ్లీష్ మీడియంలో మరో 20వేల పోస్టులు అవసరమవుతాయని తెలిపారు. మొత్తం 40వేల టీచర్ పోస్టులను డీఎస్పీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయివేట్‌కు దీటుగా గురుకులాల్లో రిజల్ట్ రావడం హర్షనీయమైనా.. అక్కడ ఒక్కో విద్యార్థిపై ఏడాదికి సగటున రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నారని.. అదేస్థాయిలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్ స్కూల్స్‌లోనూ వెచ్చిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఎస్టీఎఫ్ఐ సమావేశాలు త్రివేండ్రంలో జరిగాయని, దీనిలో విద్యారంగంలో అమలవుతున్న విధానాలపై పలు తీర్మానాలు చేసినట్టు చెప్పారు. మూఢ, మత విశ్వాసాలను పెంపొందించే విధానాలను రద్దు చేయాలన్నారు. నూతన విద్యావిధానంపై సంతకాల సేకరణతోపాటు పలు రకాల ఉద్యమాలు నిర్వహించామని, ఇక మీదట కూడా నిర్వహిస్తామన్నారు. జూనియర్ పంచాయతీ కార్మికులు, మహిళా రెజ్లర్ల నిరసనకు మద్దతు ప్రకటించారు. సకాలంలో వేతనాలు ఇవ్వాలని సంఘం రాష్ట్ర ఆడిటింగ్ బాధ్యులు మహబూబ్అలీ కోరారు. ఉమ్మడి జిల్లాల వారీగా ఉన్న జీపీఎఫ్‌ను జిల్లాల వారీగా విభజించాలని సంఘం జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు కోరారు. వేసవి సెలవుల్లోనూ పాఠశాలలకు రావాల్సిందిగా డీఈవో మౌఖిక ఆదేశాలు జారీ చేస్తుండటాన్ని తప్పుబట్టారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దుర్గాభవాని, వైస్ ప్రెసిడెంట్ షమీ, రాష్ట్ర కమిటీ సభ్యులు రాంబాబు, షేక్ రంజాన్ తదితరులు ఉన్నారు.