Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రమైన ఉక్కపోత
- వీణవంకలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత
- లీటర్లకొద్ది నీళ్లుతాగినా తీరని దాహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భానుడు భగభగ మండిపోతున్నాడు. ఎండతో హడలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తన ప్రతాపాన్ని తీవ్రస్థాయిలో చూపుతున్నాడు. పది దాటితో ఇంట్లో నుంచి కాలు బయటపెడితే మాడ పగలగొట్టేస్తున్నాడు. లీటర్ల కొద్దీ నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. మరోవైపు ఉక్కపోత తీవ్రతరం అయ్యింది. దీంతో ప్రజలు ఎండవేడిమి తాళలేక హడలిపోతున్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంకలో 45.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. రాబోయే మూడు నాలుగు రోజుల పాటు కూడా ఎండలు దంచికొట్టే అవకాశముంది. ఉష్ణోగ్రతలు కూడా ఇప్పుడున్నదానికంటే 2 నుంచి నాలుగు డిగ్రీల మేర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే మూడునాలుగు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణం ఉంటుంది. ఆదివారం కూడా కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్, జగిత్యాల, నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, మంచిర్యాల, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
వీణవంక(కరీంనగర్) 45.8 డిగ్రీలు
జైన (జగిత్యాల) 45.4 డిగ్రీలు
ధర్మపురి(జగిత్యాల) 45.3 డిగ్రీలు
పమ్మీ(ఖమ్మం) 45.0 డిగ్రీలు
సారంగాపూర్(జగిత్యాల) 45.0 డిగ్రీలు
జక్రాన్పల్లి(నిజామాబాద్) 45.0 డిగ్రీలు