Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైస్‌మిల్లర్ల తీరుపై రైతుల ఆందోళన
నవతెలంగాణ-బోధన్
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిచి రంగు మారడంతో పాటు మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే రైస్‌మిల్లర్ల యజమానులు తరుగు పేరిట కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండల కేంద్రంలోని తిరుమల రైస్‌మిల్ ఎదుట రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా హూన్స సొసైటీ చైర్మెన్ మందర్న రవి మాట్లాడుతూ.. ఇటీవల ఏకధాటిగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల మూలంగా బోధన్-సాలూర మండలంలోని పలు సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధ్యానం కొనుగోలు కేంద్రాల వద్ద , రోడ్ల వెంబడి ఉన్న కొంతమంది రైతుల ధాన్యం కుప్పల కిందకు కొంత వర్షం నీరు చేరడం వల్ల కుప్ప కింది భాగంలోని వడ్లు తేమ శాతంతో కొంత రంగు మారాయని తెలిపారు. దాన్ని సాకుగా చూపడంతో పాటు వర్షాలతో తేమ 14-15 శాతం ఉందని, అలాగే నూక శాతం ఎక్కువగా ఉందని తరుగు ఎక్కువగా ఇస్తేనే ధాన్యం దించుకుంటామని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీ చైర్మెన్ హోదాలో రైతుల పక్షాన వెళ్లి మాట్లాడినా కూడా కొందరు మిల్లర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్లీనరీ సమావేశంలో రైతుల వద్ద ఉన్న తడిసిన ధాన్యాన్ని-మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ హామీ ఇచ్చారని దాంతో రైతులు హర్షం వ్యక్తం చేశారని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి రైతుల ఇబ్బందులు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు ఖాజాపూర్ అశోక్, హున్సా మాజీ ఎంపీటీసీ చీల శంకర్, సొసైటీ డైరక్టర్ రమేష్, రైతులు శంకర్, ఛిద్రపు అనిల్, చీల ప్రకాష్ బాధిత రైతులు పాల్గొన్నారు.