Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 94.11 శాతం అభ్యర్థుల హాజరు
- నేడు ఇంజినీరింగ్ విభాగం ప్రాథమిక కీ విడుదల
- 17 వరకు అభ్యంతరాల స్వీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంసెట్ రాతపరీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 10 నుంచి ఆన్లైన్లో ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ఎంసెట్ రాతపరీక్షలు ముగియడంతో ఉన్నత విద్యామండలి, ఎంసెట్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇటీవల కాలంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ, పదోతరగతి పత్రాలు పరీక్షా కేంద్రాల నుంచి బయటికి రావడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఆ ప్రభావం ఎంసెట్‌పైనా ఉంటుందని అందరూ భావించారు. కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు ముగియడంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ బి డీన్‌కుమార్, కోకన్వీనర్ కె విజయకుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్‌కు 3,20,683 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, వారిలో 3,01,789 (94.11 శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. 18,894 మంది గైర్హాజరయ్యారని వివరించారు. తెలంగాణ నుంచి 2,48,479 మంది దరఖాస్తు చేస్తే, 2,35,918 (94.94 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 12,561 మంది హాజరు కాలేదని తెలిపారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేయగా, 65,871 (91.23 శాతం) మంది పరీక్ష రాశారని వివరించారు. 6,333 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఐదు రోజులపాటు నిర్వహించిన ఈ పరీక్షల్లో ముగ్గురు అభ్యర్థులపై మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొదటి రోజు నుంచి చివరి వరకు ఈ పరీక్షలు జరుగుతున్న తీరును ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ కట్టా నర్సింహారెడ్డి పర్యవేక్షించారు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం రాతపరీక్షలను ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు తేదీల్లో నిర్వహించామని డీన్‌కుమార్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రాథమిక కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్‌ను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశముందని సూచించారు. ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 17వ తేదీ సాయంత్రం ఎనిమిది గంటల వరకు సమర్పించొచ్చని కోరారు. ఎంసెట్ వెబ్సైట్ ద్వారానే అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. ఇతర పద్ధతుల్లో స్వీకరించబోమని స్పష్టం చేశారు.