Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్ రైస్ గోడౌన్లో అగ్నిప్రమాదం
- 600 క్వింటాళ్ల బియ్యం అగ్నికి ఆహుతి
నవ తెలంగాణ- జడ్చర్ల
జడ్చర్ల పట్టణం గంగాపూర్ శివారులోని పత్తి మార్కెట్ యార్డులో ఉన్న సివిల్ సప్లరు గోడౌన్లో ఆదివారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో గోడౌన్లో నిల్వ ఉన్న దాదాపు 600 క్వింటాళ్లకుపైగా సీజ్ చేసిన పీడీఎస్ బియ్యం, వంద క్వింటాళ్లకుపైగా రేషన్ దుకాణాల బియ్యం మంటల్లో కాలిపోయాయి. 70వేలకు పైగా గన్నీ సంచులు అగ్నికి ఆహుతై బూడిదయ్యాయి. అందులో 13వేల కొత్త గన్నీ సంచులు కాలిపోయాయి. దాంతో సుమారు రూ.40 లక్షల ప్రభుత్వ ఆస్తి నష్టం జరిగనట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. గోడౌన్లో మంటలు అంటుకున్న విషయాన్ని గోడౌన్ కాంట్రాక్టర్ రమేష్, డీటీ కిషోర్ స్థానిక ఫైర్ సిబ్బందికి సమాచారాన్ని తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దాంతో ఘటనా స్థలంలో ఉన్న జిల్లా సివిల్ సప్లరు డీఎం ప్రవీణ్ ఉన్నతాధికారులతో మాట్లాడి గోడౌన్ గోడలను కూల్చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినా మంటలు ఆర్పేందుకు సుమారు నాలుగు గంటలు పైగా సమయం పట్టింది. కాగా ఈ విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ సీతారాం ఘటనా స్థలానికి చేరుకొని కాలిపోతున్న గోడౌన్ని పరిశీలించారు. అక్కడ చేపడుతున్న సహాయక చర్యలను మంటలు, ఆర్పడానికి ఫైర్ సిబ్బంది చేపడుతున్న చర్యలను పరిశీలించి గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాద నష్టాన్ని అంచనా వేసి సివిల్ సప్లరు రాష్ట్ర ఉన్నతాధి కారులకు ఫోన్లో సమాచారం అందించారు.
అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు
పట్టణంలో సివిల్ సప్లరు గోదాంలో అగ్ని ప్రమాదం సంభవించి భారీగా ప్రభుత్వ ఆస్తినష్టం జరగడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.
గోడౌన్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతోపాటు పరిసరాల్లో మంటలు సంభవించడానికి ఎలాంటి ఆధారం కనిపించలేదు.
పీడీఎస్ బియ్యం వద్ద మంటలు ఎలా అంటుకున్నాయి అనే పలు అనుమానాలు చెలరేగుతున్నాయి. కూలీలు ఎవరైనా బీడీ కాల్చిపడేశారా లేక ఎవరైనా కావాలనే గోడౌన్లో మంటలు పెట్టారా అని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై సివిల్ సప్లరు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.