Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్‌కు తమ్మినేని లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు సోమవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో 2,100 ఖాళీలున్నప్పటికీ 1,335 మంది అధ్యాపకులు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు 25 ఏండ్ల నుంచి విధుల్లో ఉన్నారని వివరించారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 16 ప్రకారం వారికి తగిన అర్హతలున్నప్పటికీ నేటికీ ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. కొంతమేరకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసినప్పటికీ రెగ్యులరైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం పెండింగ్‌లోనే ఉంచిందని తెలిపారు. జీవో నెంబర్ 16 ప్రకారం డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లోని కాంట్రాక్టు అధ్యాపకుల సర్వీసులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని గుర్తు చేశారు. కానీ, అదే తరహాలో అర్హులైన విశ్వవిద్యాలయాల కాంట్రాక్టు అధ్యాపకుల సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత విద్యాభివృద్ధికి, విద్యార్థులను తీర్చిదిద్డడంలోను, పరిశోధనారంగంలోను వారు ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. కావున రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోవాలని కోరారు.