Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నెల ప్రారంభమై పక్షం రోజులు గడుస్తున్నా రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఉద్యోగులకు జీతాలందలేదు. మూడు నెలల నుంచి ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా ఇస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి నెలా ఐదో తేదీలోపు ఇచ్చే జీతాలు కొంత కాలంగా 20వ తేదీ వచ్చినా అందడం లేదని సమాచారం.
దీంతో ఉద్యోగుల ఇంటి అద్దె, హౌమ్ లోన్లు, ఇతర ఈఎంఐలు కట్టలేక డిఫాల్టర్లుగా మిగిలిపోవాల్సి వస్తున్నది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ ఆర్గనైజేషన్ (న్యాకో) నిబంధనల మేరకు ఉద్యోగులకు ప్రతి నెలా ఐదో తేదీలోపు జీతాలివ్వాల్సి ఉంటుంది. దానికి అంతకు ముందు నెలలో 20వ తేదీ తర్వాత జిల్లాల వారీగా హాజరు పట్టికను రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థకు చేరుతుంది. ప్రతి నెలా 30వ తేదీ వరకు జీతాలకు సంబంధించిన ఫైల్‌ను సిద్ధం చేస్తారు. మరుసటి నెల ఒకటో తేదీ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఫైల్‌పై సంతకం చేసి, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆమోదంతో జీతాల ఫైల్ బ్యాంకుకు పంపించడం ఆనవాయితీ. అయితే కొత్తగా వచ్చిన అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూడు నెలల నుంచి ఈ ప్రక్రియను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే జీతాల ఆలస్యానికి కారణమని తెలుస్తున్నది. సొసైటీ పరిధిలో 750 మందికి పైగా పని చేస్తున్నారు. వీరిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, కౌన్సిలర్లు, ఫార్మసిస్టులు, కేర్ కో ఆర్డినేటర్ వంటి కేడర్లలో ఉండి రోగులకు సేవలందిస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో, ఐసీటీసీ, పీపీటీసీపీ, బ్లడ్ బ్యాంక్, ఏఆర్టీ సెంటర్లు తదతర విభాగాల్లో ఉంటూ హెచ్ఐవీ మందుల సరఫరా తదితర సేవలందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రాజెక్ట్ డైరెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది సకాలంలో జీతాలు అందేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.